Share News

మహారాష్ట్రకు ఇద్దరు పరిశీలకులు

ABN , Publish Date - Dec 03 , 2024 | 04:12 AM

మహారాష్ట్రలో కొత్త సీఎం ఎవరన్న అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించేందుకు బీజేపీ అధిష్టానం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌, గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీలను పరిశీలకులుగా నియమించింది.

మహారాష్ట్రకు ఇద్దరు పరిశీలకులు

నిర్మల, విజయ్‌ రూపానీలకు బాధ్యత

రేపు బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక

ముంబై, డిసెంబరు 2: మహారాష్ట్రలో కొత్త సీఎం ఎవరన్న అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించేందుకు బీజేపీ అధిష్టానం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌, గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీలను పరిశీలకులుగా నియమించింది. వీరిలో రూపానీ నేడు ముంబై చేరుకోనుండగా నిర్మల 4న చేరుకుంటారు. వీరిద్దరూ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి నేతలతో చర్చలు జరుపుతారు. ఈ నెల 4న ఉదయం 10 గంటలకు ముంబైలోని విధానసభ సెంట్రల్‌ హాల్‌లో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక ఉంటుంది. ఫడణవీ్‌సను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నాక ఆయననే ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆర్‌ఎ్‌సఎస్‌ మద్దతు కూడా ఫడణవీ్‌సకే ఉన్నట్లు సమాచారం. ఈ నెల ఐదున సాయంత్రం 5 గంటలకు ముంబై ఆజాద్‌ మైదానంలో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్‌ శిందేకు ఫడణవీస్‌ ఫోన్‌ చేశారు. ఆరోగ్య వివరాలు కనుక్కోవడమే కాక తన సన్నిహితుడైన గిరీశ్‌ మహాజన్‌ను శిందే దగ్గరకు పంపారు.

అంతకు ముందు అనారోగ్యం కారణంగా శిందే మహాయుతి నేతల సమావేశంతో పాటు మిగతా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. వాస్తవానికి డిప్యూటీ సీఎం పదవితో పాటు హోం శాఖ కూడా ఇవ్వాలని శిందే పట్టుబడుతున్నట్లు సమాచారం. హోంమంత్రిత్వ శాఖ తనకు కేటాయిస్తే సీఎం పదవి లేకపోయినా తన ప్రతిష్ట తగ్గదని, ఒకవేళ తాను కోరిన మంత్రిత్వ శాఖలు ఇవ్వకపోతే ప్రతిపక్ష నేతగా అయినా కొనసాగుతానంటూ శిందే బీజేపీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. మరోవైపు, తాను డిప్యూటీ సీఎం రేసులో లేనని శిందే తనయుడు శ్రీకాంత్‌ చెప్పారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్‌ పవార్‌, ఇతర ఎన్సీపీ నేతలు భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వంలో చేపట్టబోయే మంత్రిత్వ శాఖల కేటాయింపులపై చర్చించారు. ఇప్పటికే జరిగిన చర్చల ప్రకారం బీజేపీకి 20, శివసేనకు 12, ఎన్సీపీకి పది మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉంది. ఈ నెల 5న కూటమి తరపున కనీసం 20 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని సమాచారం.

Updated Date - Dec 03 , 2024 | 04:49 AM