ప్రతిపక్ష నేతగా రాహుల్ తగరు
ABN , Publish Date - Dec 20 , 2024 | 03:45 AM
పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనల్లో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు ప్రతిపక్ష నేతగా ఆయన తగరని నిరూపించిందని బీజేపీ ఆరోపించింది.
కండబలం చూపిస్తారా?: బీజేపీ
న్యూఢిల్లీ, డిసెంబరు19: పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనల్లో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు ప్రతిపక్ష నేతగా ఆయన తగరని నిరూపించిందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, పీయూష్ గోయల్, అనురాగ్ సింగ్ ఠాకూర్ విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ తోయడంతో తమ పార్టీ ఎంపీలు ప్రతాప్ సింగ్ సారంగి, ముఖేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారని చౌహాన్ ఆరోపించారు. పార్లమెంట్‌లో కండబలం చూపిస్తారా, గూండాలు పార్లమెంట్‌కు రావొచ్చా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటుందని రాహుల్ ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న తీరు సరికాదని, పీయూష్ గోయల్ అన్నారు. తన తీరుపై రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
‘అంబేడ్కర్’పై అబద్ధాలు ఆపండి
అంబేడ్కర్ అంశంలో అబద్ధాలు ఆపాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్‌కు సూచించారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అనేకసార్లు అవమానించిందన్నా రు. అంబేడ్కర్‌ను నెహ్రూ ద్వేషించేవారని, రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారని ఆరోపించారు. తన మంత్రివర్గంలో అంబేడ్కర్ లేకపోవడం తనకు ఆనందాన్నిస్తోందని నెహ్రూ లేఖలు రాశారని గుర్తు చేశారు. అంబేడ్కర్ అంత్యక్రియలు జరిగిన ముంబైలోని చైతన్య భూమిని అప్పగిస్తామని కాంగ్రెస్ చేయలేదని, మోదీ ప్రభుత్వం 2015లో ఆ పని పూర్తి చేసిందని నడ్డా గుర్తు చేశారు.
రాహుల్ నాపట్ల అనుచితంగా ప్రవర్తించారు: మహిళా ఎంపీ
పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ తనను అసౌకర్యానికి గురిచేశారని బీజేపీ రాజ్యసభ మహిళా ఎంపీ ఫంగ్నోన్ కొన్యాక్ ఆరోపించారు. ప్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా రాహుల్ తనకు అతి సమీపంగా వచ్చారని ఆమె చెప్పారు. తనపై గట్టిగా అరుస్తూ అనుచితంగా ప్రవర్తించారని, ఒక మహిళగా అసౌకర్యానికి గురయ్యానన్నారు. రాహుల్ చర్యలతో తన గౌరవానికి భంగం కలిగిందని, తనకు రక్షణ కల్పించాలని రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌ను కోరారు. ’