Share News

సిద్దరామయ్యకు ఊరట

ABN , Publish Date - Aug 20 , 2024 | 05:16 AM

ముడా ఇంటిస్థలాల వివాదంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సిద్దరామయ్య భార్య పార్వతి పేరిట 14 ప్లాట్ల కేటాయింపుపై గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌కు

సిద్దరామయ్యకు ఊరట

ఈ నెల 29 వరకు చర్యలు వద్దన్న హైకోర్టు

కర్ణాటక సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్‌

విధానసౌధలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా

గవర్నర్‌ తీరును ఖండిస్తూ కాంగ్రెస్‌ నిరసనలు

ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ కార్యకర్త మృతి

బెంగళూరు, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): ముడా ఇంటిస్థలాల వివాదంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సిద్దరామయ్య భార్య పార్వతి పేరిట 14 ప్లాట్ల కేటాయింపుపై గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌కు మూడు ఫిర్యాదులు అందడంతో సీఎంను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ అనుమతించిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా సిద్దరామయ్య తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ కర్ణాటక హైకోర్టులో సోమవారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మంత్రివర్గ నిర్ణయాన్ని తిరస్కరించి, గవర్నర్‌ ఆదేశాలు ఇవ్వడం సరికాదని మనుసింఘ్వీ వాదించారు. ఇప్పటికే విచారణ పూర్తయిన 12 అంశాలు గవర్నర్‌ ముందున్నా వాటి ప్రాసిక్యూషన్‌కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గవర్నర్‌ బీఎన్‌ఎ్‌స చట్టాన్ని ఉల్లంఘించారని, హడావుడిగా షోకాజ్‌ నోటీసు ఇచ్చారని వాదించారు. సీఎంపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త టీజే అబ్రహాంకు గతంలో సుప్రీంకోర్టు జరిమానా విధించిందని గుర్తు చేశారు. సిద్దరామయ్య భార్యకి ఆమె సోదరుడు దానంగా ఇచ్చిన భూమిని 2014లో స్వాధీనం చేసుకున్నారని, ఇందుకు పరిహారంగా 50:50 నిష్పత్తిన ఇంటిస్థలాలు కేటాయించారని తెలిపారు. గవర్నర్‌ తరఫున తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ గవర్నర్‌ మంత్రివర్గ సలహా తీసుకోవాల్సిన అవసరంలేదని, మధ్యప్రదేశ్‌ వివాదంలోనూ ధర్మాసనం ఆవిషయాన్ని ప్రస్తావించిందని తెలిపారు. సీఎం సలహా మేరకే మంత్రుల నియామకం ఉంటుం ది గనుక మంత్రివర్గం నిర్ణయం ఆయనకు అనుకూలంగానే ఉంటుందన్నారు. కాగా, ఈనెల 29వరకు గడువుకావాలని సీఎం తరఫు న్యాయవాది కోరగా హైకోర్టు అంగీకరించింది. ప్రజాప్రతినిధుల కోర్టు కూడా ఈనెల 29వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.నాగప్రసన్న ప్రత్యేక ధర్మాసనం ఆదేశించింది. ఫిర్యాదుదారులు ప్రదీ్‌పకుమార్‌ తరఫున ప్రభులింగ నావదగి, స్నేహమయి కృష్ణ తరఫున లక్ష్మీఅయ్యంగార్‌, అబ్రహాం తరఫున రంగనాథరెడ్డి వాదనలు వినిపించారు.


కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ నిరసనలు

గవర్నర్‌ నిర్ణయాన్ని ఖండిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. సీఎం సొంతనగరం మైసూరులో నిర్వహించిన ఆందోళనలో వేలాది మంది పాల్గొన్నారు. ప్రతిచోటా గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నేతలు యడియూరప్ప, విజయేంద్ర, జేడీఎస్‌నేత కుమారస్వామి దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరోవైపు సీఎం సిద్దరామయ్య రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ విధానసౌధలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. కాగా, గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌పార్టీ బీసీ, ఎస్సీ, మైనారిటీ సామాజికవర్గాల కార్యకర్తలు సోమవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్‌ కార్యకర్త రవిచంద్రన్‌(61) మాట్లాడుతూనే గుండెపోటుకు గురై కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. రవిచంద్రన్‌ మృతి పట్ల సీఎం సిద్దరామయ్య ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు.

రాజకీయ, న్యాయ పోరాటాలు చేస్తా: సిద్దూ

గవర్నర్‌ నిర్ణయంపై రాజకీయంగానూ, న్యాయపరంగానూ పోరాటం చేస్తామని సిద్దరామయ్య ప్రకటించారు. సోమవారం బెంగళూరులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదన్నారు. రాజకీయంగా తనను అంతమొందిస్తే.. కాంగ్రెస్‌ కూడా అంతమవుతుందని బీజేపీ భావిస్తోందని, అయితే బీజేపీ కుట్రలు సాకారం కాబోవన్నారు.

Updated Date - Aug 20 , 2024 | 05:16 AM