Share News

BJP: కమలం ఆశల రేకులు

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:35 AM

వరుసగా మూడు ఎన్నికల్లో గెలుపు..! అప్పుడెప్పుడో నెహ్రూ హయాంలో కాంగ్రె్‌సకు తప్ప మరే పార్టీకీ సాధ్యం కాని ఘనమైన రికార్డు ఇది. ఉత్తమ ప్రధానులుగా పేరు తెచ్చుకున్న వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌లకూ అందని ఘనత ఇది..!

BJP: కమలం ఆశల రేకులు

  • హ్యాట్రిక్‌ కొట్టి రికార్డు సాధించడంపై బీజేపీ గురి.. మోదీ ఆకర్షణే బలం..

  • కొత్త సీఎంలున్న చోట ఎలాంటి ఫలితం వస్తుందో?

  • బలమైన దక్షిణాది నేతలను ఎలా ఎదుర్కొంటుందో?

  • ఏపీలో చంద్రబాబుతో జట్టు.. కాషాయానికి పట్టు

  • గత 2 సార్లకంటే సానుకూల అంశాలతో ప్రజల్లోకి

  • ‘బాండ్‌’లు బ్యాడ్‌ చేస్తాయా? ధరలు దెబ్బేస్తాయా?

  • విపక్షాలపై మితిమీరి కక్షసాధింపు చేటు చేస్తుందా?

(సెంట్రల్‌ డెస్క్‌)

కానీ, ఈసారి బీజేపీ మాత్రం హ్యాట్రిక్‌ కొట్టేస్తాం అంటోంది..! మోదీ సారథ్యంలో పోయినసారి సాధించిన 303 స్థానాలను ఇప్పుడు 370 దాటిస్తామంటోంది. తమ కూటమి ఎన్డీఏకు అయితే 400 దాటడం ఖాయమంటోంది..! ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతూ.. ప్రతిపక్ష పార్టీలను ఆత్మరక్షణలోకి నెడుతూ.. తనదైన శైలిలో దూకుడుగా ముందుకెళ్తోంది.

అయితే, కమల దళం లక్ష్యం నెరవేరుతుందా..?2019లో దేశ పశ్చిమ ప్రాంతం, హిందీ బెల్ట్‌ను దాదాపు స్వీప్‌ చేసిన ఆ పార్టీకి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బెంగాల్‌, దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి పుంజుకుంటుందా? వ్యవస్థాగత బలం.. మోదీ ఆకర్షణ మంత్రంతో అనుకున్నది సాధిస్తుందా..? దానిముందున్న బలాలు, బలహీనతలు, అవకాశాలు, అడ్డంకులు ఇవీ..


మోదీ మేనియా..

బీజేపీ ‘బలం’ అంతా మోదీనే. ప్రజలను సమ్మోహితులను చేసే శక్తితో ఏ ప్రతిపక్ష నేతకూ అందనంత ఎత్తులో ఉన్నారాయన. గట్టి ప్రతిపక్షాలున్న రాష్ట్రాలు, పార్టీకి సంస్థాగత బలం లేని రాష్ట్రాల్లోనూ మోదీ ఆకర్షణే కమలానికి కొండంత బలం. 2014లో ఇదే బీజేపీకి భారీగా సీట్లు వచ్చేలా చేసింది. 2019లో తెలంగాణ, ఒడిసాలోనూ ఆ పార్టీ సత్తా చాటేందుకు కారణమైంది. జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టితో చాలా రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగతంగా బాగా బలపడింది.

ఇది ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ఉపయోగపడనుంది. రామ మందిరాన్ని సాకారం చేశామంటూ హిందీ బెల్ట్‌లోని ఓటర్లను ఆకట్టుకుంటోంది. జాతీయవాదంతో ఇప్పటికే ఓ వర్గం ప్రజలను తనవైపు తిప్పుకొన్న బీజేపీ.. సంక్షేమ మంత్రంతో మిగతా వర్గాలనూ కలుపుకొనిపోతోంది.


యువ నాయకత్వంపై భారం.. రాజ్‌పుత్‌ల రెబల్‌

గత ఏడాది చివర్లో కాకలు తీరిన సీనియర్లను పక్కనపెట్టి, ఉత్తరాదిన బలమైన సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని భజన్‌లాల్‌ శర్మ (రాజస్థాన్‌), మోహన్‌ యాదవ్‌ (మధ్యప్రదేశ్‌), విష్ణుదేశ్‌ సాయీ (ఛత్తీ్‌సగఢ్‌)లను ముఖ్యమంత్రులను చేసింది బీజేపీ. ఇటీవల ఖట్టర్‌ను అనూహ్యంగా మార్చేసి.. హిమాచల్‌ సీఎంగా నాయబ్‌ సైనీకి బాధ్యతలు అప్పగించింది. ఇది ‘బలహీనత’ కానుందా? అనే అభిప్రాయమూ వినిపిస్తోంది.

నాయబ్‌తో పాటు కొత్త సీఎంలదరూ ఎన్నికల్లో ఏం చేస్తారో చూడాలి. బలమైన ప్రతిపక్ష నేతలు లేనందున.. జాతీయవాదం, హిందూత్వం, సంక్షేమ పథకాలు ఉత్తరాదిన బీజేపీకి చాలావరకు ప్రయోజనం చేకూర్చినా.. ఇవే అంశాలు దక్షిణాది, తూర్పున పనిచేయడం కష్టమే. ఎందుకంటే బెంగాల్‌లో మమతాబెనర్జీ మొదలు తమిళనాడులో స్టాలిన్‌, తెలంగాణలో రేవంత్‌రెడ్డి, కర్ణాటకలో సిద్దరామయ్య వంటి నాయకులు ప్రతిపక్షాలకు ఉన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన బెంగ రాజ్‌పుత్‌లు.

బ్రిటిష్‌ వారితో రోటీ-బేటీ సంబంధాలు ఏర్పర్చుకుని రాజ్‌పుత్‌లు మనుగడకు ఇబ్బంది రాకుండా చూసుకున్నారని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కేంద్ర మంత్రి వీకే సింగ్‌కు ఘాజియాబాద్‌ టికెట్‌ నిరాకరించడంతో పశ్చిమ యూపీలో 10 శాతం ఉన్న రాజ్‌పుత్‌లు బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాజస్థాన్‌, హరియాణ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లోనూ కాషాయ పార్టీ పట్ల ఇదే వైఖరి వ్యక్తమవుతోంది.


ఏపీలో బాబు బలం.. గతం కంటే సానుకూలం

ఆర్టికిల్‌ 370 రద్దు, రామమందిర నిర్మాణం పూర్తి, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల సాకారం, ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ముందడుగు, రేషన్‌ పొడిగింపు తదితర అంశాలతో.. ఈసారి ఎన్నికలను బీజేపీ చాలా సానుకూలంగా ప్రారంభించింది. 2014, 2019లో ఆ పార్టీకి చెప్పుకొనేందుకు ఇన్ని ‘అవకాశాలు’ లేవు.

ఇక ‘ఇండియా’ కూటమి మూలస్తంభమైన నీతీశ్‌ కుమార్‌నే బీజేపీ తమవైపు లాగేసుకుంది. కాంగ్రెస్‌కు సీట్ల పంపకాన్ని మమతా బెనర్జీ పట్టించుకోకపోవడం, కేజ్రీవాల్‌ ఢిల్లీ మద్యం కేసులో అరెస్టవడం, ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని టీడీపీతో పొత్తు కాషాయ పార్టీకి కలిసొచ్చేదిగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, తమిళనాడులో ఏఐఏడీఎంకే బలహీనపడడం కూడా అందివచ్చిన అవకాశాలే. ప్రధాని మోదీ దక్షిణాదిన ఉధృత ప్రచారం మరో సానుకూలాంశం.


‘బాండ్‌’లు.. బ్యాడ్‌ చేస్తాయేమో?

మోదీ పదేళ్ల పాలనలో ధరలు, నిరుద్యోగం పెరుగుదలను ప్రతిపక్షాలు గట్టిగా లేవనెత్తుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు.. ఎన్నికల బాండ్ల వివరాల్లో అతి పెద్ద లబ్ధిదారు బీజేపీనే అని తేలడమూ ఆ పార్టీ దూకుడుకు ‘అడ్డంకి’గా మారే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. అసలే దర్యాప్తు సంస్థలను తమపైకి ఉసిగొల్పుతోందంటూ బీజేపీపై విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల బాండ్లు వాటికి అందివచ్చిన అస్త్రంగా మారాయి.

గత ఎన్నికల్లో దేశ తూర్పున ఉన్న బిహార్‌, జార్ఖండ్‌, బెంగాల్‌లో బీజేపీ వరుసగా 17, 11, 18 సీట్లు నెగ్గింది. ఇటీవలి పరిణామాల్లో ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ తీరు వివాదాస్పదమైంది. ఒడిసాలో గతంలోని 8 సీట్లను నిలుపుకొంటుందా? అనేది కూడా చూడాలి. కాగా, 2019లో కమలం కర్ణాటకలో 25 సీట్లను గెలిచింది. మహారాష్ట్రలో పోటీ చేసిన 25 స్థానాల్లో 23 నెగ్గింది. ఇప్పుడు అక్కడ అంత సులువు కాదనేలా పరిస్థితులు ఉన్నాయి. యూపీలో అఖిలేశ్‌యాదవ్‌ ఆధ్వర్యంలోని సమాజ్‌వాదీ పార్టీ, బిహార్‌లో తేజస్వీ యాదవ్‌ సారథ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్‌లు దళిత, మైనార్టీ, బీసీ ఓటు బ్యాంక్‌తో బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తున్నాయి.

Updated Date - Apr 27 , 2024 | 09:41 AM