ఆ 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు!
ABN , Publish Date - Nov 22 , 2024 | 06:31 AM
అదానీ గ్రూపుపై అమెరికాలో కేసు నమోదైన వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. అదానీ గ్రూపుపై సంయుక్త
నాడు ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్..
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాలు ఉన్నాయి
‘అదానీ’ లంచాలకు కాంగ్రెస్సే సమాధానం చెప్పాలి
మోదీ ప్రతిష్ఠను దెబ్బతీయడమే రాహుల్ లక్ష్యం
2002 నుంచీ నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారు
కాంగ్రెస్ అగ్రనేతపై ధ్వజమెత్తిన బీజేపీ
న్యూఢిల్లీ, నవంబరు 21: అదానీ గ్రూపుపై అమెరికాలో కేసు నమోదైన వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. అదానీ గ్రూపుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై ఘాటుగా స్పందించింది. అమెరికా కోర్టు పేర్కొన్న నాలుగు రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేదని గుర్తుచేసింది. మోదీ ప్రతిష్ఠను దెబ్బ తీయడమే లక్ష్యంగా రాహుల్, సోనియాలు 2002 నుంచీ ఆయనపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారంది. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. రాహుల్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా కోర్టులో అదానీ కంపెనీపై అభియోగాలు మోపారని.. వాటికి ఆ కంపెనీయే సమాధానం ఇచ్చుకుంటుందని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. రూ.2238 కోట్ల లంచం ఇవ్వజూపారంటూ అమెరికా కోర్టు పేర్కొన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్, తమిళనాడుల్లో బీజేపీయేతర పార్టీలే అధికారంలో ఉన్నాయని పాత్రా గుర్తుచేశారు. ఆ సమయంలో ఛత్తీ్‌సగఢ్, తమిళనాడుల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్ష పార్టీలే అధికారంలో ఉన్నాయని చెప్పారు. ఇక ఏపీలో వైసీపీ, ఒడిసాలో బీజేడీ అధికారంలో ఉన్నాయని.. ఆ రెండు ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో అధికార, ప్రతిపక్ష కూటముల్లో భాగస్వాములుగా లేవని తెలిపారు. గౌతమ్ అదానీ అవినీతిపరుడని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ.. తొలుత కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన అదానీ గ్రూప్‌కు, తన పార్టీకి మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నించాలని సూచించారు. మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు చేయడం కంటే తప్పు జరిగినట్లు నిజంగా రాహుల్ నమ్మితే కోర్టులను ఆశ్రయించి కేసులు పెట్టొచ్చు కదా? అని పాత్రా అన్నారు. అదానీ కంపెనీ తమిళనాడులో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని, ఇటీవలే తెలంగాణలో స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చిందని గుర్తుచేశారు. అదానీ అవినీతిపరుడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు ఆయన కంపెనీ నుంచి పెట్టుబడులు కోరుకుంటున్నాయని నిలదీశారు. రాహుల్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని అసంబద్ధ ఆరోపణలు చేయడం వల్ల గురువారం స్టాక్ మార్కెట్‌లో 2.5 కోట్ల మంది మదుపరులు భారీగా సొమ్ములు కోల్పోయారని ఆరోపించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాహల్ కొత్త డ్రామాకు తెరలేపారని ధ్వజమెత్తారు.
ఈ అంశాన్ని అడ్డుపెట్టుకొని పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని విమర్శించారు. ‘‘అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన నేరారోపణల ప్రకారం.. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ)కు 12 గిగావాట్ల విద్యుత్తు సరఫరా చేసేందుకు భారత కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. విద్యుత్తు సరఫరా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో రాష్ట్రాల కంపెనీలు కొనుగోలుకు ఆసక్తి చూపించలేదు. దీంతో అదానీ గ్రూప్ 2021 జూలై నుంచి 2022 ఫిబ్రవరి మధ్య ఒడిసా, తమిళనాడు, ఛత్తీ్‌సగఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 265 మిలియన్ డాలర్లు ముట్టజెప్పింది. ఆ సమయంలో ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈ లంచాలకు సమాధానం చెప్పాలి’’ అని బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు.