Share News

బ్లాక్‌ & వైట్‌ కాంగ్రెస్‌ - బీజేపీ ఫైట్‌

ABN , Publish Date - Feb 09 , 2024 | 03:25 AM

ఎన్నికల వేళ పార్లమెంటు వేదికగా గురువారం ‘పత్రాల’ యుద్ధం హోరాహోరీ సాగింది. ఇదిగో మోదీ పాలన నిర్వాకం అంటూ విపక్షం యూపీఏ నల్లపత్రం మీడియాకు విడుదల చేయగా, యూపీఏ పదేళ్ల పాలన అసలు గుట్టు ఇదిగో అంటూ అధికార ఎన్డీయూ ‘శ్వేతపత్రం’తో దీటుగా ఎదుర్కొంది.

బ్లాక్‌ & వైట్‌ కాంగ్రెస్‌ - బీజేపీ ఫైట్‌

ప్రెస్‌కు నల్ల పత్రం విడుదలచేసిన కాంగ్రెస్‌.. రాజ్యసభలో శ్వేతపత్రం చదివిన బీజేపీ

ఎన్నికల వేళ పత్రాల యుద్ధంతో కాక

ఒక్కసారిగా అట్టుడికిన రాజ్యసభ

ఆర్థికవ్యవస్థను నాశనంచేసిన యూపీఏ

సభలో విరుచుకుపడ్డ మోదీ సర్కారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఎన్నికల వేళ పార్లమెంటు వేదికగా గురువారం ‘పత్రాల’ యుద్ధం హోరాహోరీ సాగింది. ఇదిగో మోదీ పాలన నిర్వాకం అంటూ విపక్షం యూపీఏ నల్లపత్రం మీడియాకు విడుదల చేయగా, యూపీఏ పదేళ్ల పాలన అసలు గుట్టు ఇదిగో అంటూ అధికార ఎన్డీయూ ‘శ్వేతపత్రం’తో దీటుగా ఎదుర్కొంది. గురువారం ప్రభుత్వం సభలో శ్వేతపత్రం పెట్టనుందని తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ముందే అప్రమత్తం అయింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందే మీడియాను పిలిచి నల్లపత్రం విడుదలచేసింది. అనంతరం ఆ పార్టీ సభ్యులు నల్లవస్త్రాలు ధరించి రాజ్యసభకు వచ్చారు. అవే దుస్తుల్లో రాజ్యసభలోకి ప్రవేశించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘నల్ల పత్రం’లోని అంశాలను ప్రస్తావిస్తూ, మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అందరూ అనుకున్నట్టే భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. గత యూపీఏ ప్రభుత్వ పాలనతో తమ పరిపాలనను పోల్చుతూ ఈ పత్రంలోని అంశాలను ఆమె వివరించారు. ‘‘మంచి స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థతో యూపీఏ 2004లో తన పాలన ప్రారంభించింది. కానీ, మా చేతికి 2014లో అప్పగించేసరికి అది పతనావస్థలో ఉంది. అవినీతి తారస్థాయిలో ఉండేది. ఆర్థిక క్రమశిక్షణ లేదు. నిధుల దుర్వినియోగానికి అంతులేదు. సర్వత్రా సంక్షోభ ఛాయలు కనిపించాయి’’ అని తెలిపారు. కాంగ్రెస్‌ 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను తన హయాంలో కొనసాగించడంలో విఫలమయిందని విమర్శించారు. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గత పదేళ్లలో అనేక కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని నిర్మ ల వివరించారు. అంతకుముందు.. ‘‘పదేళ్ల అన్యాయ కాలం’’ పేరిట కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 54 పేజీలతో కూడిన బ్లాక్‌ పేపర్‌ను విడుదల చేశారు. గత పదేళ్లలో జరిగిన ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్యాయాలను ఎత్తిచూపుతూ మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ ప్రభు త్వం ఈ పదేళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయరంగాన్ని సర్వనాశనం చేసిందని, నిరుద్యోగాన్ని పెంచిందని, మహిళలపై నేరాలు పెరుగుతున్నా పట్టించుకోలేదని, మైనారిటీలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ‘‘ప్రధాని మోదీ పార్లమెంటులో మాట్లాడినప్పుడల్లా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారు. అందుకే బ్లాక్‌ పేపర్‌ ద్వారా బీజేపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం’’ అని ఖర్గే అన్నారు.

అన్నీ లోపభూయిష్ఠ నిర్ణయాలే...

మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిందని, పెద్దనోట్ల రద్దు, లోపభూయిష్ఠమైన జీఎస్టీ వంటి ఆర్థిక విపత్తులు చోటుచేసుకున్నాయని బ్లాక్‌ పేపర్‌లో కాంగ్రెస్‌ ఆరోపించింది. లక్షలాది మంది రైతులు, దినసరి కూలీల భవిష్యత్తును నాశనం చేశారని విమర్శించింది. భారత భూభాగంలో చైనా ఆక్రమణలపై మోదీ ప్రభుత్వం మౌనంగా ఉందని కాంగ్రెస్‌ ఆరోపించింది. అగ్నిపథ్‌ పథకంతో సైన్యాన్ని బలహీన పరుస్తోందని, ఎన్నికల కమిషన్‌, ఈడీ, ఆర్బీఐల స్వతంత్రతను దెబ్బతీస్తోందని, మీడియాతో పాటు ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వాటిని అంతం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించింది. విద్వేషం, విభజన రాజకీయాలతో దేశ సామాజిక వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టింది. కాగా, ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసి సభలో బిల్లులు ఆమోదింపజేసుకోవడం ప్రజాస్వామ్యం అవుతుందా అని మోదీ సర్కారును ఖర్గే నిలదీశారు.

మన్మోహన్‌ స్ఫూర్తిప్రదాత: మోదీ

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను స్ఫూర్తిప్రదాత అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా, చక్రాలకుర్చీ లో రాజ్యసభకు వచ్చి ఢిల్లీ సర్వీసు బిల్లు-2023పై చర్చలో పాల్గొన్నారని మోదీ గుర్తుచేశారు. గురువారం పార్లమెంటులో ఆయన.. రాజ్యసభ నుంచి పదవీవిమరణ చేస్తున్న 52మంది సభ్యుల గౌరవార్థం మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయ విభేదాలను కొంత పక్కనపెట్టి ఒకింత భావోద్వేగ ధోరణిని ప్రదర్శించారు. రాజ్యసభనూ, దేశాన్నీ తన హయాంలో స్ఫూర్తిమంతంగా మన్మోహన్‌ నడిపించారని కొనియాడారు.

Updated Date - Feb 09 , 2024 | 04:23 AM