Share News

Kamal Haasan: దేశాన్ని విభజించేందుకే బీజేపీ సీఏఏని తెచ్చింది.. కమల్ హాసన్ ధ్వజం

ABN , Publish Date - Mar 12 , 2024 | 05:23 PM

పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizenship Amendment Act) అమల్లోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం మీద సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) (Makkal Needhi Maiam) పార్టీ చీఫ్ కమల్ హాసన్ (Kamal Haasan) నిప్పులు చెరిగారు. దేశాన్ని విభజించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kamal Haasan: దేశాన్ని విభజించేందుకే బీజేపీ సీఏఏని తెచ్చింది.. కమల్ హాసన్ ధ్వజం

పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizenship Amendment Act) అమల్లోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం మీద సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) (Makkal Needhi Maiam) పార్టీ చీఫ్ కమల్ హాసన్ (Kamal Haasan) నిప్పులు చెరిగారు. దేశాన్ని విభజించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల ముందు ప్రజలను విభజించి, భారతదేశ సామరస్యాన్ని నాశనం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలనే తపనతో.. ఎన్నికల సందర్భంగా సీసీఏను హడావుడిగా తెచ్చింది’’ అని ఆయన చెప్పారు.


ఈ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు (Supreme Court) నిర్ణయిస్తుంది కాబట్టి.. నోటిఫికేషన్‌ని విడుదల చేసిన సమయం మరింత సందేహాస్పదంగా ఉందని కమల్ హాసన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ చట్టం అణగారిన మతపరమైన మైనారిటీలను రక్షించడానికి ఉద్దేశించినట్లైతే.. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న శ్రీలంక తమిళులను సీఏఏ పరిధిలోకి ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభలో తీర్మానాలు ఆమోదించడంలో.. ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడు ముందంజలో ఉందని అన్నారు. ఈ చట్టంపై ఇన్నాళ్లూ నిర్లక్ష్యం వహించిన కేంద్ర ప్రభుత్వం.. సరిగ్గా రంజాన్ నెల ప్రారంభానికి ఒక రోజు ముందు దీనిని అమల్లోకి తెచ్చిందని.. ముస్లిం సోదరులకు చేదువార్తను అందించిందని మండిపడ్డారు.

తన ఎంఎన్ఎం పార్టీ సీఏఏని వ్యతిరేకించిందని, సుప్రీంకోర్టులో దీనిని సవాలు చేసిన మొదటి వ్యక్తి తానేనని కమల్ హాసన్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ముందే హడావుడిగా ఈ చట్టాన్ని అమలు చేయడం.. బీజేపీ దుర్బుద్ధికి నిదర్శమని కమల్ హాసన్ తూర్పారపట్టారు. కేంద్ర ప్రభుత్వం వాస్తవికతను విస్మరించడం ఖండించదగిన విషయమని.. మనమంతా కలిసికట్టుగా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మతం, భాష, కులాల ఆధారంగా మన పౌరులను విభజించడానికి ప్రయత్నించే వారికి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఉద్ఘాటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 05:23 PM