Delhi : దౌత్య యుద్ధం!
ABN , Publish Date - Oct 15 , 2024 | 04:46 AM
భారత వేర్పాటువాద శక్తులకు ఊతమిస్తూ, ఖలిస్థానీలకు అండగా నిలుస్తున్న కెనడా సర్కారు మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. 2023లో జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీ్‌పసింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా (పర్సన్స్ ఆఫ్ ఇంట్రస్ట్) పేర్కొంది.
కెనడాపై భారత్ తీవ్ర ఆగ్రహం.. అక్కడి దౌత్యవేత్తల ఉపసంహరణ
ఆరుగురు ఆ దేశ దౌత్యవేత్తల బహిష్కరణ.. 19లోగా వెళ్లిపొమ్మని ఆదేశం
ఖలిస్థానీ నిజ్జర్ హత్య కేసు ప్రకంపనలు
అనుమానితులుగా మన దౌత్యవేత్తలు
వారిని విచారించాల్సి ఉందన్న కెనడా
ఘాటుగా స్పందించిన భారత్
ట్రూడో వైఖరిపై మండిపాటు
న్యూఢిల్లీ, అక్టోబరు 14: భారత వేర్పాటువాద శక్తులకు ఊతమిస్తూ, ఖలిస్థానీలకు అండగా నిలుస్తున్న కెనడా సర్కారు మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. 2023లో జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీ్‌పసింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా (పర్సన్స్ ఆఫ్ ఇంట్రస్ట్) పేర్కొంది. వీరిని విచారించాల్సి ఉందంటూ భారత విదేశాంగ శాఖకు సమాచారం పంపింది. దీనిపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. భారత దౌత్యవేత్తలపై చేసిన కల్పిత ఆరోపణలకు తగిన విధంగా జవాబు చెప్పే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. సోమవారం కెనడా నుంచి భారత హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంది.
భారత్‌లో ఉన్న ఆరుగురు కెనడా దౌత్య సిబ్బందిని భారత్ నుంచి ‘బహిష్కరించింది’. ‘‘కెనడా ప్రభుత్వంపై మాకు విశ్వాసం లేదు. మా హైకమిషనర్, దౌత్య, ఉన్నతాధికారుల భద్రత విషయంలో భరోసా లేకుండా పోయింది. తీవ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వ చర్యలు వారి భద్రతను ప్రమాదంలోకి నెట్టాయి. అందుకే భారత హైకమిషనర్, దౌత్య, ఉన్నతాధికారులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాం’’ అని భారత్‌లో కెనడా హైకమిషనర్ (ఇన్‌చార్జి) స్టీవార్ట్ వీలర్‌కు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
వీలర్‌తోపాటు ఆరుగురు కెనడా దౌత్య సిబ్బందిని భారత్ నుంచి బహిష్కరించింది. వీరు ఈనెల 19వ తేదీలోపు భారత్‌ను వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. 1988 ఐఎ్‌ఫఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ కుమార్ వర్మ.. 2022 సెప్టెంబరు నుంచి కెనడాలో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆయనపై కెనడా ఆరోపణలు చేయడాన్ని భారత్ ఖండించింది. ఆయన ఎలాంటివారో తమకు తెలుసునని, 36 సంవత్సరాలుగా ఆయన వివిధ దేశాల్లో భారత దౌత్యవేత్తగా పనిచేస్తున్నారని తెలిపింది. కెనడా ప్రధాని ట్రూడో కేవలం రాజకీయ లబ్ధి కోసం భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి, వేర్పాటువాదులకు కొమ్ము కాస్తున్నారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
‘‘భారత్‌పై ట్రూడో శత్రుత్వం ఇప్పటిదికాదు. దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘‘ట్రూడో మంత్రివర్గంలో కొందరికి తీవ్రవాదులు, భారతదేశ విభజన కోరుకునే వారితో నేరుగా సంబంధాలున్నాయి. 2018 నుంచి ట్రూడో భారత్‌తో ఘర్షణాత్మక వైఖరినే ప్రదర్శిస్తున్నారు. 2020 డిసెంబరులో భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఆయన నిజస్వరూపం బయటపడింది’’ అని విదేశాంగ శాఖ నిప్పులు చెరిగింది. భారత వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై ట్రూడోను విచారణ కమిషన్ నిలదీయనున్న నేపథ్యంలోనే ఈ ఎజెండాను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, క్షీణిస్తున్న భారత్- కెనడా దౌత్య సంబంధాల విషయంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాల సలహాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. ఉభయ దేశాల మధ్య ఎంతో సున్నితమైన ఈ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభల ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు ఇతర పార్టీల నేతలపై ప్రధాని మోదీ విశ్వాసం ఉంచి వారి నుంచి సలహాలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది.
తిరుగులేని సాక్ష్యాలున్నాయి: వీలర్
భారత ప్రభుత్వ ఏజెంట్లకు, కెనడా గడ్డపై జరిగిన కెనడా పౌరుడి (నిజ్జర్) హత్యకు మధ్య ఉన్న సంబంధాలపై తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని కెనడా దౌత్యవేత్త వీలర్ తెలిపారు. అయితే.. భారత్ చెబుతున్నట్లు అన్ని ఆరోపణలపైనా దృష్టి పెట్టాలని అన్నారు. భారత్‌తో సహకరించేందుకు కెనడా సిద్ధంగా ఉందని తెలిపారు.