రాజ్యసభలో నోట్ల కట్ట!
ABN , Publish Date - Dec 07 , 2024 | 05:06 AM
రాజ్యసభలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీ అభిషేక్ సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 వద్ద ఒక నోట్ల కట్ట లభ్యమైందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ శుక్రవారం సభలో ప్రకటించారు.
తెలంగాణ ఎంపీ సింఘ్వీ సీటు వద్ద లభ్యం
భద్రతా తనిఖీల్లో లభ్యమైందన్న చైర్మన్
ఆ డబ్బులు నావి కావు: అభిషేక్ సింఘ్వీ
న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీ అభిషేక్ సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 వద్ద ఒక నోట్ల కట్ట లభ్యమైందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ శుక్రవారం సభలో ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం సభ వాయిదా పడగానే భద్రతా దళాలు నిర్వహించిన రోజువారీ తనిఖీల్లో సింఘ్వీ కూర్చునే సీటు వద్ద నోట్ల కట్ట కనిపించిందని తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రాగానే నిబంధనల ప్రకారం దర్యాప్తునకు ఆదేశించానని చెప్పారు. దీనిపై సింఘ్వీ స్పందించారని, ఈ విషయాన్ని తాను మొదటిసారి వింటున్నానని చెప్పారని దన్‌ఖడ్ పేర్కొన్నారు. తాను సభకు వచ్చినప్పుడల్లా కేవలం రూ.500 నోటు మాత్రమే తీసుకువస్తానని సింఘ్వీ చెప్పినట్లు తెలిపారు. మరోవైపు సింఘ్వీ ‘ఎక్స్’లోనూ, మీడియా వద్ద వివరణ ఇచ్చారు. గురువారం తాను సభకు వచ్చిన మూడు నిమిషాలకే వాయిదా పడటంతో క్యాంటీన్‌కు వెళ్లానని అన్నారు. ఆ తర్వాత అటు నుంచే బయటకు వెళ్లానని చెప్పారు.
ఎంపీ సీటులో ఎవరైనా ఏమైనా పెట్టవచ్చునని వ్యాఖ్యానించారు. కాగా, దర్యాప్తు జరిగి ఎవరు డబ్బు పెట్టారో తేలనంతవరకూ ఎంపీ పేరును ప్రస్తావించకూడని కాంగ్రెస్ అఽధ్యక్షుడు ఖర్గే.. చైర్మన్‌ను కోరారు. కానీ, బీజేపీ అభ్యంతరం తెలిపింది. డబ్బు ఎక్కడ దొరికిందో తేలినప్పుడు ఆ ఎంపీ పేరును ఎందుకు ప్రకటించకూడదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు పశ్నించారు. అయితే పార్లమెంట్‌లో కీలకమైన చర్చల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు. రైతుల సమస్య, మోదీ-అదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా పక్కదారి పట్టించేందుకే నోట్ల కట్ట దొరికిందంటూ హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. పైగా ఆ నోట్ల కట్ట విలువ రూ.50 వేలే ఉంటుందన్నారు. ఎవరి వద్దనైనా రూ.50 వేల కట్ట దొరికి తే అందులో నేరం ఏముందని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఏ ఏజెన్సీతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చని, జేపీసీ కూడా వేయవచ్చునని కాంగ్రెస్ నేతలు రాజ్యసభ చైర్మన్‌ను కలిసి చెప్పినట్లు తెలిసింది.