National : ఇరాన్‌లో సంబరాలు జరుపుకొన్న ప్రజలు!
ABN , Publish Date - May 21 , 2024 | 03:57 AM
ఇబ్రహీం రైసీ మరణంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇది ఇజ్రాయెల్ పనేనా? అంటూ ఎక్కువ మంది ట్రోల్ చేశారు. రైసీ ఆదివారం ఉదయం డ్యామ్ ప్రారంభోత్సవం నిమిత్తం అజర్‌బైజాన్ దేశానికి వెళ్లారని,
ఇజ్రాయెల్ పనేనంటూ నెటిజన్ల ట్రోల్
టెహ్రాన్/టెల్‌అవీవ్, మే 20: ఇబ్రహీం రైసీ మరణంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇది ఇజ్రాయెల్ పనేనా? అంటూ ఎక్కువ మంది ట్రోల్ చేశారు. రైసీ ఆదివారం ఉదయం డ్యామ్ ప్రారంభోత్సవం నిమిత్తం అజర్‌బైజాన్ దేశానికి వెళ్లారని, ఆ దేశానికి ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలున్నాయని నెటిజన్లు గుర్తుచేశారు. అజర్‌బైజాన్ సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడం ఇజ్రాయెల్ పనేనంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. హెలికాప్టర్ ప్రమాదానికి తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని వివరించింది.
ఇదిలా ఉండగా, రైసీ హెలికాప్టర్ కూలిపోయిందని ఆదివారం సాయంత్రం వార్తలు రావడంతోనే.. టెహ్రాన్‌తోపాటు.. పలు నగరాల్లో ఇరానీయులు సంబురాలు జరుపుకొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కఠిన శిక్షలకు కేంద్ర బిందువుగా ఉన్న రైసీ మరణం తమకు సంతోషంగా ఉందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రెండేళ్ల క్రితం హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో జరిగిన ఆందోళనలను అణచివేయడంలో రైసీది కీలక భూమిక అని, ఆ సందర్భంలో ప్రభుత్వం చేతిలో 500 మందికి పైగా మరణించారని గుర్తుచేస్తున్నారు.