దేశ పర్యాటక రంగానికి ఊతం
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:06 AM
దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
3,295 కోట్లతో 40 ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా.. ఏపీలోని గండికోట, అఖండ గోదావరి- రాజమహేంద్రవరాలకు చోటు
‘సాస్కి’ కింద 172.35 కోట్లు కేటాయింపు.. తెలంగాణలోని రామప్ప, సోమశిల ప్రాంతాల అభివృద్ధికి రూ.141.84 కోట్లు
న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్/యూనియన్ టెరిటరిస్ ఫర్ క్యాపిటల్ ఇన్వె్‌స్టమెంట్(సాస్కి)’ పథకం కింద ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనుంది. ఇందుకు సంబంధించి 23 రాష్ట్రాల్లోని 40 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం రూ.3,295.76 కోట్ల నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వనుంది. 50 ఏళ్ల కాలవ్యవధితో వడ్డీ రహిత రుణాల రూపంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ నిధులను విడుదల చేస్తుంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ప్రోత్సాహం లభిస్తుందని, సుస్థిరమైన పర్యాటకంతో కొత్తగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా 40 ప్రాజెక్టుల వివరాలను పంచుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండేసి చొప్పున పర్యాటక ప్రాంతాలు కేంద్రం ప్రకటించిన ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి గండికోటతో పాటు అఖండ గోదావరి-రాజమహేంద్రవరం ప్రాజెక్టుల అభివృద్ధికి సాస్కి కింద కేంద్రం రూ.172.35 కోట్లు కేటాయించింది. గండికోటకు రూ.77.91 కోట్లు, అఖండ గోదావరి-రాజమహేంద్రవరం ప్రాజెక్టుకు రూ.94.44 కోట్లు కేటాయించింది. అఖండ గోదావరిలో భాగంగా హేవలాక్ వంతెన, పుష్కర్ ఘాట్‌ను అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణలోని రామప్ప, సోమశిల పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.141.84 కోట్లు కేటాయించింది. రామప్ప రీజియన్ సుస్థిర పర్యాటక సర్క్యూట్ పేరుతో చేపట్టే ప్రాజెక్టుకు రూ.73.74 కోట్లు, సోమశిల వెల్‌నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల కింద చేపట్టే ప్రాజెక్టుకు రూ.68.10 కోట్లను కేంద్రం కేటాయించింది.