హిజ్బుల్లా చీఫ్‌గా కెమిస్ట్రీ ప్రొఫెసర్
ABN , Publish Date - Oct 30 , 2024 | 06:00 AM
హిజ్బుల్లా తమ సెక్రటరీ జనరల్‌గా విద్యావంతుడైన షేక్ నయీం-బిన్-మహమ్మద్ ఖాసీంను ప్రకటించింది.
మూడు దశాబ్దాలు డిప్యూటీగా సేవలు
న్యాయశాస్త్రంపై అధ్యయనం.. పరిశోధనలు
బీరుట్/టెల్‌అవీవ్, అక్టోబరు 29: హిజ్బుల్లా తమ సెక్రటరీ జనరల్‌గా విద్యావంతుడైన షేక్ నయీం-బిన్-మహమ్మద్ ఖాసీంను ప్రకటించింది. హిజ్బుల్లా సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఖాసీం.. మూడు దశాబ్దాలుగా ఆ సంస్థకు డిప్యూటీ చీఫ్‌గా.. అల్-మూసావీ, హసన్ నస్రల్లా హయాంలో సేవలందించారు. గత నెల 27న బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హసన్ నస్రల్లా మృతిచెందగా.. ఆయన అల్లుడు షఫిద్దీన్ తదుపరి చీఫ్ అవుతారని అంతా భావించగా.. సిరియాలోని డమాస్క్‌సపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అతను కూడా మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత నెల రోజులపాటు నాయకత్వం లేకుండానే.. హిజ్బుల్లా ముందుకు సాగింది.
మిగతా చీఫ్‌లకు భిన్నం
హిజ్బుల్లా మిలిటెన్సీకి చీఫ్‌లుగా వ్యవహరించిన అల్-మూసావీ, హసన్ నస్రాల్లాతో పోలిస్తే.. ఖాసీం విద్యావంతుడు. మొదటి ఇద్దరూ మహమ్మద్ ప్రవక్తకు వారసులుగా చెప్పుకొంటూ.. నల్లటి తలపాగాను ధరించేవారు. ఖాసీం మాత్రం శాంతికి చిహ్నమైన తెలుపురంగు తలపాగాను ధరిస్తారు. 1953లో బీరుట్‌లోని తహ్తాబస్తా ప్రాంతంలో జన్మించిన ఖాసీంకు భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1970లో లెబనీస్ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీగా పనిచేస్తూనే.. రసాయనశాస్త్రం అభ్యసించారు. 1977 నుంచి రసాయనశాస్త్రంలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఫ్రెంచ్‌లో ప్రావీణ్యంతోపాటు.. న్యాయశాస్త్రం, షియాపై అధ్యయనాలు చేశారు. లెబనాన్ యూనియన్ ఆఫ్ ముస్లిం స్టూడెంట్స్ సంస్థను స్థాపించారు. 1974-88 మధ్యకాలంలో ఇస్లామిక్ రిలీజియస్ ఎడ్యుకేషన్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. 1974లో అల్-సదర్ స్థాపించిన మూవ్‌మెంట్ ఆఫ్ ద డిస్టెప్టెడ్ సైనిక విభాగం(లెబనీస్ రెసిస్టెంట్స్ రెజిమెంట్)లో చేరారు. దీన్నే అమల్ ఉద్యమం అంటారు. ఇరాన్ విప్లవం తర్వాత.. అమల్ ఉద్యమానికి రాజీనామా చేశారు. ఇమామ్ ఖోమెనీతో ప్రభావితమై.. 1982లో హిజ్బుల్లా వ్యవస్థాపక సభ్యుడిగా.. డిప్యూటీ చీఫ్‌గా నియమితులయ్యారు.
శరణార్థులపై భవనంపై దాడి
ఉత్తర గాజాలో శరణార్థులు తలదాచుకుంటున్న ఓ భవనంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) మంగళవారం జరిపిన బాంబింగ్‌లో 93 మంది మృతిచెందారు. ఇదే ప్రాంతంలో హమాస్ జరిపిన కాల్పుల్లో నలుగురు ఐడీఎఫ్ సైనికులు మృతిచెందారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్‌లో ఐక్యరాజ్య సమితి(ఐరాస) అనుబంధ సంస్థ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏపై నిషేధం విధించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఔషధాలను తరలించిన భారత్
పాలస్తీనా ప్రాంతంలో యుద్ధవాతావరణం నేపథ్యంలో మూడు టన్నుల ఔషధాలను సాయంగా పంపినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ ఔషధాల్లో లైఫ్‌సేవింగ్, క్యాన్సర్ నివారణ మందులు ఉన్నట్లు ఎక్స్‌లో పోస్టు చేశారు.