Ram Mandir: తీర్పు చెప్పిన న్యాయమూర్తులకు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాలు
ABN , Publish Date - Jan 19 , 2024 | 07:13 PM
దశాబ్దాలపాటు ఎటూ తేలని వివాదానికి ఒక్క తీర్పుతో పరిష్కారం చూపిన అప్పటి న్యాయమూర్తులకు రామ జన్మ భూమి నుంచి ఆహ్వానం అందింది. ఏళ్లుగా నానుతూ వచ్చిన అయోధ్య రామ మందిరం - బాబ్రీ మసీదు కేసులో నవంబర్ 9, 2019న అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది.
ఢిల్లీ: దశాబ్దాలపాటు ఎటూ తేలని వివాదానికి ఒక్క తీర్పుతో పరిష్కారం చూపిన అప్పటి న్యాయమూర్తులకు రామ జన్మ భూమి నుంచి ఆహ్వానం అందింది. ఏళ్లుగా నానుతూ వచ్చిన అయోధ్య రామ మందిరం - బాబ్రీ మసీదు కేసులో నవంబర్ 9, 2019న అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద భూమి రాముడికే చెందుతుందని.. మసీదు నిర్మాణానికి అదే నగరంలో వేరే ప్రాంతంలో 5 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు వచ్చిన వెంటనే అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం నిర్మాణాలు వేగంగా పూర్తి కావడంతో జనవరి 22న శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తీర్పు వెలువరించిన వారిలో ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తోపాటు మాజీ సీజేఐలు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వీరికి ఆలయ ట్రస్టు సభ్యులు ఆహ్వానాలు పంపారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పంపిన ఆహ్వానితుల జాబితాలో మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ఉన్నత న్యాయవాదులతో పాటు 'రామ్ లల్లా' తరఫున వాదించిన న్యాయవాది పరాశరన్ సహా 50 మంది న్యాయనిపుణులు కూడా ఉన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కి సైతం ఆహ్వానాలు వెళ్లాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి