Share News

Congress: కాంగ్రెస్‌ రెండో జాబితా రేపు

ABN , Publish Date - Mar 11 , 2024 | 09:44 AM

లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను మంగళవారం ప్రకటించేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ.. ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో సోమవారం భేటీకానుంది.

Congress: కాంగ్రెస్‌ రెండో జాబితా రేపు

  • నేడు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

  • తెలంగాణలో పలు స్థానాలపై రానున్న స్పష్టత

న్యూఢిల్లీ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను మంగళవారం ప్రకటించేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ.. ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో సోమవారం భేటీకానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధిర్‌ రంజన్‌ చౌదరి, అంబికా సోని, ముకుల్‌ వాస్నిక్‌, టీఎస్‌ సింగ్‌ దేవ్‌ తదితర సీఈసీ సభ్యులు పాల్గొంటారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా గుజరాత్‌లో ఉన్న రాహుల్‌గాంధీ ఈ సమావేశానికి వర్చువల్‌గా హాజరవుతారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ సహా ఏడు రాష్ట్రాల్లోని స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చిస్తారు.

అనంతరం అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేస్తారు. కాగా, ఈ జాబితాలో తెలంగాణకు సంబంధించి పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్‌ స్థానాల్లో 9 సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినా తొలి జాబితాలో నల్లగొండ, జహీరాబాద్‌, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌ స్థానాల అభ్యర్థులనే ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు ఖరారు చేసినా వివిధ సమీకరణాల దృష్ట్యా తొలి జాబితాలో వారి పేర్లు ప్రకటించలేదు. ఇప్పుడు రెండో బాబితాలో నిజామాబాద్‌, చేవెళ్ల, సికింద్రాబాద్‌, మెదక్‌, పెద్దపల్లి మొదలగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. చేవెళ్ల నుంచి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి బొంతు రామ్మోహన్‌, మెదక్‌ నుంచి నీలం మధు, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్‌ తరపున పోటీ కి సిద్ధంగా ఉన్నారు. వీరు ఈమధ్యే కాంగ్రెస్‌లో చేరారు.

Updated Date - Mar 11 , 2024 | 09:45 AM