అంబేద్కర్‌పై షా వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం
ABN , Publish Date - Dec 22 , 2024 | 02:31 AM
అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమైంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 21(ఆంధ్రజ్యోతి): అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమైంది. ఈ మేరకు దశలవారీగా ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన సర్య్కులర్‌ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం విడుదల చేశారు. అంబేద్కర్‌ను అవమానించినందుకు అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరనసలు తెలపాలని అందులో పిలుపునిచ్చారు. ఈ నెల 22, 23 తేదీల్లో అమిత్ షా తీరును మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. 24న అన్ని జిల్లాల్లో అంబేద్కర్ సమ్మాన్ మార్చ్‌లు నిర్వహించాలని సూచించారు. ప్రతి జిల్లాలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలన్నారు. చివరి దశలో రాష్ట్రపతికి మెమోరాండం అందిస్తామని తెలిపారు.