Share News

మాటలకు అందని విషాదం.. ఇద్దరు కొడుకుల మృతదేహాలను చెరో భూజాన వేసుకుని..

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:15 PM

Dead sons on Shoulders: భార్యభర్తలు చెరో మృతదేహాన్ని భుజాలపై వేసుకొని వెళ్లడం ఈ వీడియోలో కనిపించింది. బురదగా ఉన్న మట్టి రోడ్డుపై అడవి గుండా నడిచి వెళ్లడం వీడియోలో కనిపించింది. కాగా బాలురు ఇద్దరూ జ్వరాలతో చనిపోయారు. సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.

మాటలకు అందని విషాదం.. ఇద్దరు కొడుకుల మృతదేహాలను చెరో భూజాన వేసుకుని..

గడ్చిరోలి: మాటల్లో వర్ణించలేని విషాదం ఇదీ. ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులకూ ఎదురుకాకూడదని ఆవేదన ఇది. పదేళ్ల కన్నా తక్కువ వయసున్న ఇద్దరు కొడుకులు ఒకేసారి చనిపోయారు. మృతదేహాలను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ లేకపోవడంతో చెరొక డెడ్‌బాడీని భూజాన వేసుకొని 15 కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరుకున్నారు. హృదయాలను మెలిపెడుతున్న ఈ తీవ్ర విషాద ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో వెలుగుచూసింది. అహేరి తాలూకాకు చెందిన దంపతులకు ఈ దయనీయ పరిస్థితి ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.


“ఇద్దరు అన్నదమ్ముళ్లు జ్వరంతో బాధపడ్డారు. కానీ వారికి సకాలంలో చికిత్స అందలేదు. కొన్ని గంటల్లోనే వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. బాలురు ఇద్దరూ చనిపోయారు. మైనర్ల మృతదేహాలను వారి గ్రామం పట్టిగావ్‌కు తరలించడానికి అంబులెన్స్ కూడా లేదు. తల్లిదండ్రులు వర్షంలో తడిసి బురదగా మారిన మార్గం గుండా 15 కిలోమీటర్ల మేర నడిచారు. గడ్చిరోలి వైద్య సంరక్షణ వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో వాస్తవికత ఈ రోజు మళ్లీ తెరపైకి వచ్చింది’’ అని విజయ్ వ్యాఖ్యానించారు.


భార్యభర్తలు చెరో మృతదేహాన్ని భుజాలపై వేసుకొని వెళ్లడం ఈ వీడియోలో కనిపించింది. బురదగా ఉన్న మట్టి రోడ్డుపై అడవి గుండా నడిచి వెళ్లడం వీడియోలో కనిపించింది. కాగా బాలురు ఇద్దరూ జ్వరాలతో చనిపోయారు. సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందిన ఆసుపత్రి నుంచి వారి ఊరు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ జిల్లా ప్లానింగ్ కమిటీకి ఎక్స్-అఫీషియో చైర్‌పర్సన్‌గా ఉన్నారు.


దీంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. మహారాష్ట్ర అంతటా పార్టీ కార్యక్రమాలు చేపడితే రాష్ట్రం అభివృద్ధి చెందదని, క్షేత్రస్థాయికి వెళ్లి గడ్చిరోలిలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలని, అక్కడి ప్రజలు ఏవిధంగా జీవిస్తున్నారో చూడాలని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కాగా సెప్టెంబరు 1న గిరిజన జాతికి చెందిన ఓ గర్భిణీకి తీవ్ర విషాదం ఎదురైంది. అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో హాస్పిటల్‌కు వెళ్లలేకపోయారు. దీంతో కడుపులోని బిడ్డ చనిపోయింది. ఈ ఘటనలను చూపించి అధికార పక్షంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ రెండు ఘటనలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చినీయాంశమయ్యాయి. నెటిజన్లు అక్కడి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు.

Updated Date - Sep 05 , 2024 | 04:23 PM