Delhi: ఆ విషయాల్లో మా పరిధి పరిమితం.. సంక్షేమ పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 23 , 2024 | 05:20 PM
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల(Welfare Schemes) అమలుపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.
ఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల(Welfare Schemes) అమలుపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA), ఇతర సంక్షేమ పథకాలను కేంద్రం, రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పిన ధర్మాసనం.. కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
"ప్రభుత్వ విధానపర నిర్ణయాలను పరిశీలించడంలో న్యాయ పరిధి చాలా పరిమితంగా ఉంది. ఏదైనా పథకం బాగుంది, బాగోలేదు అని చెప్పే అధికారం కోర్టుకు లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ కచ్చితత్వం, అనుకూలత, సముచితతను పరిశీలించలేం. అదే విధంగా.. నిర్దిష్ట విధానాన్ని లేదా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించలేం. ఎన్ఎఫ్ఎస్ఐ లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ కిచెన్‌ల ఏర్పాటు అనే భావన రాష్ట్రాల ముందు ఉన్న ఉత్తమమైన మార్గమా.. అనే విషయాన్ని కూడా పరిశీలించలేం. బదులుగా వేరే సంక్షేమ పథకాలు అమలు చేయాలనే సూచనలు ఇస్తాం" అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసేలా అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు అనున్ ధావన్, ఇషాన్ సింగ్, కునాజన్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆకలి, పోషకాహార లోపం కారణంగా ప్రతిరోజు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చాలా మంది పిల్లలు మరణిస్తున్నారని, ఈ పరిస్థితి పిల్లల జీవించే హక్కుతో సహా వివిధ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు వాదించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి