Share News

Challo Delhi : ఢిల్లీ అష్ట దిగ్బంధం

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:06 AM

రోడ్లపై ఇసుక సంచులు.. ముళ్ల కంచెలు, కాంక్రీట్‌ దిమ్మెలు.. అల్లర్ల నిరోధక బలగాలు.. ఎక్కడికక్కడ సరిహద్దుల మూసివేత.. డ్రోన్లతో నిఘా.. ప్రజలు గుమిగూడడంపై ఆంక్షలు..! ఇదీ దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి. అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు హామీనిస్తూ చట్టం తేవాలని, రుణ మాఫీ, పింఛన్లు తదితర డిమాండ్లను

Challo Delhi : ఢిల్లీ అష్ట దిగ్బంధం
ఢిల్లీ, యూపీ సరిహద్దులో రోడ్డుపై కాంక్రీటుతో గోడ కడుతున్న దృశ్యం

దేశ రాజధానిలో నెల రోజులు 144 సెక్షన్‌

నేడు రైతుల ‘‘చలో ఢిల్లీ’’ నేపథ్యంలో ఆంక్షలు

నగరంలోకి ట్రాక్టర్లు, ట్రక్కుల రాకపై నిషేధం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రోడ్లపై ఇసుక సంచులు.. ముళ్ల కంచెలు, కాంక్రీట్‌ దిమ్మెలు.. అల్లర్ల నిరోధక బలగాలు.. ఎక్కడికక్కడ సరిహద్దుల మూసివేత.. డ్రోన్లతో నిఘా.. ప్రజలు గుమిగూడడంపై ఆంక్షలు..! ఇదీ దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి. అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు హామీనిస్తూ చట్టం తేవాలని, రుణ మాఫీ, పింఛన్లు తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పార్లమెంటు ముట్టడికి రైతు సంఘాలు మంగళవారం ‘‘చలో ఢిల్లీ’’ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. నగరాన్ని అష్ట దిగ్బంధం చేశాయి. దేశ రాజధానిలో నెల రోజుల పాటు 114 సెక్షన్‌ అమలయ్యేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూపీ, పంజాబ్‌, హరియాణాతో ఉన్న సరిహద్దుల్లో జాతీయ రహదారులను పూర్తిగా మూసివేశారు. బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు మూడేళ్ల కిందట రైతుల సుదీర్ఘ ఆందోళనకు కేంద్రంగా మారిన సింఘా, ఘాజీపూర్‌, టిక్రీల్లో భారీగా బలగాలను మోహరించారు. వాహనాలు ముందుకు కదిలితే టైర్లు పంక్చర్‌ అయ్యేలా రోడ్లపై మేకులు పరిచారు. ఘజియాబాద్‌తో పాటు పలుచోట్ల రోడ్లపై అడ్డంగా సిమెంటు దిమ్మెలు పెట్టి వాటి మధ్య కాంక్రీట్‌ మిశ్రమం నింపారు. 144 సెక్షన్‌ నేపథ్యంలో బహిరంగ సమావేశాల నిర్వహణ, ట్రాక్టర్లు, ట్రక్కులు, ట్రాలీల రాకను నిషేధించినట్లు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ ఆరోరా తెలిపారు. లైసెన్స్‌డ్‌ తుపాకులు, మండే స్వభావం గల పదార్థాలు, కత్తులు, త్రిశూలాలు, రాడ్లు, బరిసెలను వెంట తీసుకురావొద్దని పేర్కొన్నారు. లౌడ్‌ స్పీకర్లపైనా ఆంక్షలు వర్తిస్తాయన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రధాన రోడ్లపైకి రావొద్దని సూచించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో అటు రాష్ట్రాలు కూడా చర్యలు చేపట్టాయి. పంజాబ్‌తో అంబాలా వద్ద ఉన్న సరిహద్దును హరియాణా మూసివేసింది. కాగా, పంజాబ్‌ నుంచి ఇప్పటికే ఢిల్లీ దిశగా ట్రాక్టర్లు బయల్దేరాయి.

2,500 ట్రాక్టర్లు.. 20 వేల మంది రైతులు

వ్యవసాయోత్పత్తుల మద్దతు ధరలకు చట్టబద్ధత, లఖీంపూర్‌లో రైతులపై జరిగిన హత్యాకాండలో నిందితులను శిక్షించడం, నకిలీ ఎరువులు, విత్తనాల తయారీదారులపై కఠిన చర్యలు, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించడం కూడా రైతుల డిమాండ్లలో ఉన్నాయి. మంగళవారం చలో ఢిల్లీతో పాటు 16న గ్రామీణ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఛలో ఢిల్లీకి 2,500 ట్రాక్టర్లలో వివిధ రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది రైతులు రావొచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. రైతు సంఘాలు 40 సార్లు సన్నాహకం కూడా చేశాయని పేర్కొన్నాయి. దక్షిణాది రాష్ట్రాల రైతులు కూడా ఢిల్లీ చేరుకునే వీలుందని భావిస్తున్నాయి.

అరెస్టులపై ఆగ్రహం

ఆలిండియా డెమోక్రటిక్‌ ఉమెన్స్‌ అసోషియేషన్‌, భూమి అధికార్‌ ఆందోళన్‌ కిసాన్‌ సంఘర్ష్‌ సమితి, బీకేయూ (టికాయత్‌) నాయకులను మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేయడాన్ని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) తీవ్రంగా ఖండించింది. కాగా, పీయూష్‌ గోయల్‌, అర్జున్‌ ముండా, నిత్యానందరాయ్‌లతో కూడిన కేంద్ర మంత్రుల బృందం రైతు ప్రతినిధులతో చర్చలు జరపనుంది.

Updated Date - Feb 13 , 2024 | 04:06 AM