త్వరలో కేజ్రీవాల్‌కు బెయిల్?
ABN , Publish Date - May 08 , 2024 | 03:31 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చే విషయాన్ని సుప్రీంకోర్టు సానుకూలంగా పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ, మే 7(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చే విషయాన్ని సుప్రీంకోర్టు సానుకూలంగా పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఎలాంటి అధికార విధులూ నిర్వహించరాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది.
గురువారం (ఈ నెల 9న) కానీ వచ్చే వారం కానీ కేజ్రీవాల్ బెయిల్‌పై మలి విచారణ జరుపుతామని తెలిపింది. మరోవైపు, ఆయన కస్టడీని సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ నెల 20 వరకు పొడిగించారు. తన బెయిల్ దరఖాస్తును హైకోర్టు తిరస్కరించడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే. బెయిల్ ఇచ్చినంత మాత్రాన కేసు దర్యాప్తులో ప్రభావం ఉండదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణాబ్ గోస్వామికి కూడా ఇలాంటి ఊరటే కల్పించామని జస్టిస్ దత్తా చెప్పారు. తాము రాజకీయ నాయకులకు ఎలాంటి మినహాయింపు ఇవ్వడం లేదని, ప్రతి వ్యక్తికీ ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల వల్ల ఆ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయా లేదా పరిశీలిస్తున్నామని తెలిపింది. తన అరెస్టుకు ఆధారాలు లేవని కేజ్రీవాల్ అంటున్నారని గుర్తుచేసింది.
అందుకు తగ్గ సమాచారం తమకు ఇవ్వలేదని, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వచ్చిన ప్రకటనలన్నీ తమకు సమర్పించాలని ఈడీని కోరింది. తాము ఇచ్చేది మధ్యంతర బెయిల్ మాత్రమే కనుక ఒకవేళ ఆయన అరెస్టు తప్పని తర్వాత తేలితే సవరించుకుంటామని తెలిపింది. ఆయనను పూర్తిగా విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది.
అంతకాలం ఎందుకు పట్టింది?
‘మీరు రూ.100 కోట్ల మేరకు నేరం జరిగిందని తొలుత చెప్పారు. అది రెండు, మూడేళ్లలో రూ.1,100 కోట్లు ఎలా అయింద’ని సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. 2020 మే 9న తొలి అరెస్టు జరిగినప్పుడు కేజ్రీవాల్ అరెస్టు చేసేందుకు ఇంతకాలం ఎలా పట్టిందని అడిగింది. సెక్షన్ 19 ప్రకారం అరెస్టు చేసేందుకు తగిన ఆధారాలు ఉన్నాయా లేదా అని కూడా తాము చూడాల్సి ఉందని తెలిపింది.
‘కేజ్రీవాల్ గురించి మీరు మొదట ఎప్పుడు తెలుసుకున్నార’ని కోర్టు అడిగే సరికి 2023 ఫిబ్రవరి 23న కవిత ఆడిటర్ బుచ్చిబాబు ప్రకటనలో కేజ్రీవాల్ పేరు బయటకొచ్చిందని, ఆయన రూ.100 కోట్లు డిమాండ్ చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు. అరెస్టయిన వ్యక్తి ఇచ్చే ప్రకటనకు విలువ ఉంటుందన్నారు.
గోవా ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ బస చేసిన సెవెన్ స్టార్ హోటల్ గ్రాండ్ హయత్ బిల్లును చారియట్ ఎంటర్‌ప్రైజెస్ చెల్లించిందన్నారు. దర్యాప్తు ప్రారంభమైనప్పుడు కేజ్రీవాల్ పాత్ర కనపడలేదని, ఆ తర్వాత క్రమంగా బయటపడిందని వాదించారు.
వాద ప్రతివాదనలు
కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడం సరైంది కాదని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. రాజకీయ నాయకుడికీ, సామాన్యుడికీ వ్యత్యాసం ఉండరాదన్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈడీ దర్యాప్తు జరిపిన తర్వాతే కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిందని చెప్పారు. ఆయన రాజకీయ నేత అని, ఎన్నికల పేరుతో విడుదల చేయడం తప్పుడు సంకేతాలు పంపుతుందన్నారు. కేజ్రీవాల్ నేరాలు చేసే వ్యక్తి కాదని, ఆయన విదేశాలకు పారిపోయే అవకాశాలు లేవని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు.