Share News

Doctors Strike: దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన డాక్టర్లు..కారణం ఇదే

ABN , Publish Date - Aug 12 , 2024 | 11:42 AM

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ వైద్యురాలిపై దారుణ అత్యాచారం, హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల వైద్యులు నిరవధిక సమ్మెను ప్రకటించారు.

Doctors Strike: దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన డాక్టర్లు..కారణం ఇదే
Doctors Strike

న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ వైద్యురాలిపై దారుణ అత్యాచారం, హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల వైద్యులు నిరవధిక సమ్మెను ప్రకటించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎంపిక సేవలను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతో పాటు అనేక ఇతర నగరాల్లోని వైద్యులు ప్రకటన చేశారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని నిరసనలకు దిగిన వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ట్రైనీ వైద్యురాలు హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.


కోల్‌కతాలోని ప్రభుత్వం ఆస్పత్రి అయిన ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలిపై గత గురువారం రాత్రి హత్యాచారం జరిగింది. 32 ఏళ్ల వైద్యురాలిపై దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో బాధితురాలి కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు. అంతేకాదు ఎడమ కాలు, మెడ, కుడి చేయి, ఉంగరపు వేలు, పెదవులపై కూడా గాయాలు అయినట్టు నిర్ధారణ అయ్యింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు హత్య జరిగిన హాస్పిటల్‌ను సందర్శించారు. ఆదివారం కూడా వైద్యశాలను సందర్శించి ఆందోళన నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో మాట్లాడారు. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని హామీ ఇచ్చారు.


ఈ కేసులో సంజోయ్ రాయ్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. నిందితుడికి ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌తో అతడికి ఎలాంటి సంబంధంలేదని, అతడొక పౌర వాలంటీర్ అని, తరచూ హాస్పిటల్‌కు వస్తుంటాడని చెప్పారు. హత్యాచారం అనంతరం నిందితుడు తన స్థలానికి వెళ్లాడని, హత్యకు సంబంధించి తన వద్ద ఎలాంటి ఆధారాలు కనిపించకుండా మరుసటి రోజు ఉదయమే బట్టలు ఉతకాడని, ఆ తర్వాత నిద్రపోయాడని, కేసును విచారిస్తున్న ఒక పోలీసు అధికారి పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై పుకార్లు వ్యాపింప చేయవద్దని ప్రజలను పోలీసులు కోరారు.

Updated Date - Aug 12 , 2024 | 11:42 AM