Share News

Odisha: యువతి పుర్రెకు శస్త్రచికిత్స విజయవంతం.. 77 సూదుల తొలగింపు

ABN , Publish Date - Jul 21 , 2024 | 02:00 PM

ఒడిశాలో సంచలనం రేపిన మహిళ పుర్రెలో సూదుల ఘటనలో బాధితురాలికి శస్త్రచికిత్స విజయవంతం అయింది. బుర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లోని వైద్యులు యువతి పుర్రెలోంచి మొత్తం 77 సూదులను తొలగించారు.

Odisha: యువతి పుర్రెకు శస్త్రచికిత్స విజయవంతం.. 77 సూదుల తొలగింపు

భువనేశ్వర్: ఒడిశాలో సంచలనం రేపిన మహిళ పుర్రెలో సూదుల ఘటనలో బాధితురాలికి శస్త్రచికిత్స విజయవంతం అయింది. బుర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లోని వైద్యులు యువతి పుర్రెలోంచి మొత్తం 77 సూదులను తొలగించారు.

తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన బాధితురాలు రేష్మా బెహెరా(19) తలలో సూదులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో శస్త్రచికిత్సకు నిర్ణయించారు.


ఏం జరిగిందంటే..

బాలింగీర్ జిల్లాకి చెందిన రేష్మా అనారోగ్యంతో బాధపడుతూ ఓ మంత్రగాడిని సంప్రదించింది. తాంత్రిక విద్యలు తెలిసినట్లుగా చెబుతున్న సంతోష్ తేజ్‌రాజ్ రాణా అనే మాంత్రికుడు యువతి తలలోకి ఏకంగా 70 సూదులను గుచ్చాడు. మూఢనమ్మకంతో బాధితులు కూడా అతడ్ని నమ్మారు.

ఫలితంగా ఆమె ఆస్పత్రిపాలైంది. శుక్రవారం డాక్టర్లు సిటీ స్కానింగ్‌ పరీక్ష చేసి విస్మయం చెందారు. యువతి పుర్రెపై సూదులు ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించి యువతి తలలోని 77 సూదులను బయటికి తీశారు.


తలలోని కపాలం ఎముకపై ఉన్న సూదులు మరింత లోపలికి చొచ్చుకొని పోలేదని.. తద్వారా మెదడుకు ఏమీ కాలేదని డాక్టర్లు తెలిపారు. అలా యువతి ప్రాణాలతో బయటపడిందని చెప్పారు. చివరికి పోలీసులు మాంత్రికుడిని అరెస్టు చేశారు.

అయితే గత మూడేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని.. ఆమె తండ్రి విష్ణు బెహరా వైద్యులకు చూపించకుండా సంతోష్ తేజ్‌రాజ్ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించాడు. తాంత్రికం పేరుతో విడతలవారీగా సూదులను గుచ్చి బాధితురాలిని చిత్రహింసలకు గురి చేశాడు. ఈ మధ్యే తీవ్ర తలనొప్పితో బాధితురాలు ఆసుపత్రిపాలవ్వగా.. మాంత్రికుడి విషయం వెలుగులోకి వచ్చింది. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - Jul 21 , 2024 | 02:00 PM