Donald Trump: ట్రంప్ గెలుపు.. దేశం విడిచి వెళ్లిపోనున్న ఎలన్ మస్క్ కుమార్తె..
ABN , Publish Date - Nov 08 , 2024 | 12:14 PM
వివియాన్ ఎలన్ మస్క్ మొదటి భార్య ఆరుగురి సంతానంలో ఒకరు. ఆమె లింగమార్పిడి చేయించుకుంది. ఇది మస్క్ ను తీవ్రంగా బాధించింది.
వాషింగ్టన్: ఎలోన్ మస్క్ ట్రాన్స్ జెండర్ కుమార్తె కుమార్తె వివియాన్ జెన్నా విల్సన్ డొనాల్డ్ ట్రంప్ విజయంపై తాజాగా స్పందించింది. ట్రంప్ రాకతో అమెరికాలో తనలాంటి వారికి ఇప్పుడు భవిష్యత్తు కనిపించడం లేదని అన్నారు. ఈ మేరకు థ్రెడ్స్‌లో బుధవారం ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది.
‘‘నేను దేశం విడిచి వెళ్లిపోవాలని ఎంతో కాలంగా అనుకున్నాను. కానీ, ఇప్పుడు ట్రంప్ గెలుపుతో దేశాన్ని విడిచి వెళ్లిపోవాలనే నా కోరిక మరింత బలపడింది. ట్రంప్ నాలుగు సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉంటాడని తెలుసు. తాను గెలిస్తే లింగమార్పిడి నిబంధనలను అమలు చేస్తానని గతంలో ట్రంప్ హామీ ఇచ్చాడు.. అవన్నీ ఇప్పటికిప్పుడు అమలు కావని కూడా తెలుసు. కానీ, ట్రంప్ మాత్రమే కావాలని.. అతడిని పిచ్చిగా అభిమానించి ఓట్లు వేసిన ప్రజలు ఎప్పటికీ ఇదే సమాజంలో ఉంటారు. సమీప భవిష్యత్తులో ట్రాన్స్ జెండర్లపై వారి మనస్తత్వంలో మార్పు వచ్చే అవకాశమే లేదని తేలిపోయింది. దీనివల్ల ట్రాన్స్ జెండర్లకు అమెరికాలో భవిష్యత్తు లేదనే స్పష్టత వచ్చింది’’ అని వివియాన్ తెలిపారు.
‘‘వివియాన్ అమెరికాను వీడుతుందన్న పై ఎలన్ మస్క్ కూడా ఎక్స్‌లో స్పందించారు. ‘నా కుమారుడిని ఓక్ మైండ్‌సెట్ అనే బ్యాక్టీరియా చంపేసింది’ అని మరోసారి తెలిపాడు. దీనిపై వివియాన్ స్పందిస్తూ.. తన తండ్రి ట్వీట్ చేసిన స్క్రీన్ షాట్‌ను థ్రెడ్‌లో పోస్టు చేసింది. ఇప్పుడు కూడా నా బిడ్డకు ఏదో సోకింది.. అందుకే నన్ను నా బిడ్డ ద్వేషిస్తోంది అంటూ మళ్లీ పాత కథలే చెప్పొద్దు. వాటిని పట్టించుకోవద్దు. ఏరకంగా చూసినా నేనే బాధితురాలిని’’ అని రాసుకొచ్చింది.
వివియాన్ ఎలన్ మస్క్ మొదటి భార్య ఆరుగురి సంతానంలో ఒకరు. అయితే, అబ్బాయిగా పుట్టినప్పటికీ అమ్మాయిగా మారేందుకు ఆమె లింగమార్పిడి చేయించుకుంది. ఇది మస్క్ ను తీవ్రంగా బాధించింది. ఎంత వారించినప్పటికీ వివియాన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో ఆమెను మస్క్ దూరం పెట్టాడు. 2022 నుంచి వివియాన్ తండ్రితో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. అప్పటి నుంచి తన తండ్రికి వ్యతిరేకంగా పలు పోస్టులను పెడుతూ వార్తల్లో నిలుస్తుంటుంది.