Ram Mandir: హై సెక్యూరిటీ జోన్‌లోకి అయోధ్య.. మోహరించిన భద్రతా బలగాలు
ABN , Publish Date - Jan 22 , 2024 | 10:17 AM
అయోధ్య (Ayodhya)లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠకు సమయం ఆసన్నమవుతున్న వేళ అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి 7 వేల మంది ప్రముఖులు వస్తారని అంచనా వేస్తున్నారు. వీవీఐపీలు, వీఐపీలు రానుండటంతో సీఆర్పీఎఫ్(CRPF) దళాలు, ఏటీఎస్ కమాండోలు, యాంటీ డ్రోన్ జామర్లు, ఎస్‌పీజీ దళాలు రంగంలోకి దిగాయి. అయోధ్య నగర అణువణువును వారు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
అయోధ్య: అయోధ్య (Ayodhya)లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠకు సమయం ఆసన్నమవుతున్న వేళ అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి 7 వేల మంది ప్రముఖులు వస్తారని అంచనా వేస్తున్నారు. వీవీఐపీలు, వీఐపీలు రానుండటంతో సీఆర్పీఎఫ్(CRPF) దళాలు, ఏటీఎస్ కమాండోలు, యాంటీ డ్రోన్ జామర్లు, ఎస్‌పీజీ దళాలు రంగంలోకి దిగాయి.
అయోధ్య నగర అణువణువును వారు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని విచారిస్తున్నారు. అయోధ్యలో మొత్తంగా 10 వేలకుపైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఏఐ ఆధారిత టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇవి మనుషుల ముఖాలను కూడా గుర్తుపట్టగలవు. మరోవైపు డ్రోన్లు ఎగరేస్తూ అయోధ్యను జల్లడ పట్టేస్తున్నారు.
అపర్పీ భవన్, ధరంపత్ తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సరయూ నది వెంట ఎన్డీఆర్ఎఫ్ తదితర భద్రతా బలగాలు ఉన్నాయి. అయోధ్యకు వెళ్తున్న అన్ని మార్గాల్లో చెక్ పోస్ట్‌లు పెట్టారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) చేతుల మీదుగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దాదాపు 7 వేల మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా వేశారు. 13 వేల మందితో అయోధ్యలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.