Share News

పోల్‌ డేటాలో పొరపాట్లు జరగవు

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:26 AM

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఉన్నదంటూ కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తంచేసిన అనుమానాలను భారత ఎన్నికల సంఘం(ఈసీ) తోసిపుచ్చింది.

పోల్‌ డేటాలో పొరపాట్లు జరగవు

ఓటింగ్‌ లెక్కల్లో వ్యత్యాసం వట్టి మాట.. కాంగ్రెస్‌ నేతలకు ఈసీ స్పష్టం

చండీగఢ్‌, డిసెంబరు 25: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఉన్నదంటూ కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తంచేసిన అనుమానాలను భారత ఎన్నికల సంఘం(ఈసీ) తోసిపుచ్చింది. ఓటింగ్‌ డేటాలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయన్న ఆ పార్టీ వాదనను కొట్టి వేసింది. మహారాష్ట్రతోపాటు హరియాణా ఎన్నికల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న కాంగ్రెస్‌.. దీనిపై పార్టీ స్థాయిలో కరణ్‌ దలాల్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సోమవారం భారత ఎన్నికల సంఘాన్ని కలిసి తన అభ్యంతరాలను వెల్లడించింది. అయితే, కాంగ్రెస్‌ వాదనలను ఈసీ కొట్టిపడేసింది. పోల్‌ గణాంకాలను మార్పు చేయడానికి వీలుఉండదని తెలిపింది. మొత్తం ఎంత ఓటింగ్‌ జరిగిందో తెలిపే 17-సీ ఫామ్‌, ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో ఓటింగ్‌ ముగిసిన తర్వాత పార్టీల అభ్యర్థుల ఏజెంట్లకు అందుబాటులో ఉంటుందని వివరించింది. ‘‘పోలైన ఓటింగ్‌ వివరాలను ప్రచురించాల్సిన చట్టబద్ధ బాధ్యత మాపై లేదు. అదంతా పోలింగ్‌ స్టేషన్ల పరిధిలోని వ్యవహారం’’ అని వివరించింది. కొన్ని సందర్భాల్లో.. మొత్తం ఓటింగ్‌కు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉండే అవకాశం ఉందని ఈసీ అంగీకరించింది.

Updated Date - Dec 26 , 2024 | 05:26 AM