Share News

Delhi: ఈడీకి పరిధి ఏమీ లేదు బలమైన సాక్ష్యాలు ఉన్నందునే అరెస్టు ..

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:31 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అనేది జాతీయ దర్యాప్తు సంస్థని, దేశంలో ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉంటుందని ఈడీ తరఫున న్యాయవాది జోహెబ్‌ హుేస్సన్‌ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనకు బెయిల్‌ మంజూరుచేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.

Delhi: ఈడీకి పరిధి ఏమీ లేదు బలమైన సాక్ష్యాలు ఉన్నందునే అరెస్టు ..

జాతీయ దర్యాప్తు సంస్థకు ట్రాన్సిట్‌ ఆర్డర్‌ అవసరం లేదు.. కవితను అరెస్టు చేయబోమని ఈడీ ఎప్పుడూ చెప్పలేదు..

  • బలమైన సాక్ష్యాలు ఉన్నందునే అరెస్టు

  • కవిత బెయిల్‌ పిటిషన్‌పై న్యాయస్థానంలో ఈడీ వాదనలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అనేది జాతీయ దర్యాప్తు సంస్థని, దేశంలో ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉంటుందని ఈడీ తరఫున న్యాయవాది జోహెబ్‌ హుేస్సన్‌ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనకు బెయిల్‌ మంజూరుచేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కవిత అరెస్టు అక్రమమని ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ సోమవారం వాదనలు వినిపించారు.

కవిత అరెస్టు సమయంలో ఈడీ నిబంధనలు పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దానికి కొనసాగింపుగా మంగళవారం మళ్లీ వాదనలు జరిగాయి. తొలుత కవిత తరఫున న్యాయవాది నితేష్‌ రాణా వాదనలు వినిపించారు. కవితను సూర్యాస్తమయం తర్వాత అరెస్టు చేశారని, ఎటువంటి ట్రాన్సిట్‌ ఆర్డర్‌ ఇవ్వలేదని చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలనూ ఈడీ పట్టించుకోలేదని తెలిపారు. ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్‌ హుేస్సన్‌ అభ్యంతరం తెలిపారు. నిబంధనలన్నీ పాటించామని కోర్టుకు తెలిపారు.

కవితను అరెస్టు చేయొద్దని ఉత్తర్వులేమీ లేవు..

కవితను అరెస్టు చేయబోమని తామెప్పుడూ చెప్పలేదని ఈడీ న్యాయవాది జోహెబ్‌ హుేస్సన్‌ స్పష్టం చేశారు. విచారణకు రావాలని కవితకు నోటీసులు పంపామని, ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు 26న సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని, అప్పుడు తర్వాతి 10 రోజులు లేదా వచ్చే విచారణ తేదీ వరకు మాత్రమే ఆమెకు సమన్లు పంపబోమని తాము చెప్పినట్టు గుర్తుచేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తామెక్కడా ఉల్లంఘించలేదన్నారు. దర్యాప్తు సంస్థలు తనను ఇంటికి వచ్చి మాత్రమే విచారించాలని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని, అంతేకాని అరెస్టు చేయొద్దని కోరలేదని పేర్కొన్నారు. ఆమెను మార్చి 15న అరెస్టు చేశామని, ఆమె పిటిషన్‌ మార్చి 19న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందని ఆమె న్యాయవాది వాదించలేదన్నారు.


సూర్యాస్తమయంలోపే అరెస్టు చేశాం..

ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ. రాష్ట్ర పోలీసులకు వర్తించే నిబంధనలన్నీ ఈడీకి వర్తించవు. రాష్ట్ర పోలీసులు మాత్రమే ట్రాన్సిట్‌ ఆర్డర్‌ తీసుకోవాల్సి ఉంటుంద’ని జోహెబ్‌ హుేస్సన్‌ వాదించారు. ‘మహిళను సూర్యాస్తమయం తర్వాత అరెస్టు చేస్తేనే స్థానిక మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. కవితను సూర్యాస్తమయానికి ముందే అరెస్టు చేశాం. ఈ క్రమంలో 24 గంటల్లో మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలనే నిబంధన మాత్రమే ఈడీకి వర్తిస్తుంద’ని తెలిపారు. ‘కవితను మార్చి 15న సాయంత్రం 5.20 నిమిషాలకు హైదరాబాద్‌లో అరెస్టు చేశాం. అక్కడ సాయంత్రం 6.26 గంటలకు సూర్యాస్తమయం అయినట్లు జియోగ్రాఫికల్‌ డేటా చెబుతోంది. సూర్యాస్తమయంలోపే అరెస్టు చేశాం కాబట్టి 24 గంటల్లోపే ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచామ’ని జోహెబ్‌ హుేస్సన్‌ స్పష్టం చేశారు.

కవితకు అరుణ్‌ పిళ్లై బినామీ..

ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్రపై సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేశామని జోహెబ్‌ హుేస్సన్‌ కోర్టుకు తెలిపారు. మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి, శరత్‌చంద్రా రెడ్డి వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పారు. బుచ్చిబాబు ఫోన్‌లో కీలక సమాచారం దొరికిందని తెలిపారు. ఈ కేసులో అరుణ్‌ పిళ్లై కవితకు బినామీగా వ్యవహరించారని వాదించారు. కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరారు. ఈడీ వాదనలపై కవిత తరఫున న్యాయవాది నితేష్‌ రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము దాఖలు చేసే రీజాయిండర్‌లో సమగ్ర వివరాలు పొందుపరుస్తామని తెలిపారు.

Updated Date - Apr 24 , 2024 | 03:39 AM