Share News

Satnam Singh Sandhu: రాజ్యసభకు సత్నామ్ సింగ్ సంధూ.. ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:42 PM

పంజాబ్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, చండీగఢ్ యూనివర్సిటీ ఫౌండర్-ఛాన్స్‌లర్ సత్నామ్ సింగ్ సంధూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

Satnam Singh Sandhu: రాజ్యసభకు సత్నామ్ సింగ్ సంధూ.. ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు

న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, చండీగఢ్ యూనివర్సిటీ ఫౌండర్-ఛాన్స్‌లర్ సత్నామ్ సింగ్ సంధూ (Satnam Singh Sandhu nominated to RS) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను ఎగువ సభకు ఎంపిక చేసినట్టు పేర్కొంది.

సామాన్య నేపథ్యం నుంచి ఉన్నత శిఖరాలకు..

సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన సత్నామ్ సింగ్ సంధు దేశంలోని ప్రముఖ విద్యావేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డ ఆయన ప్రపంచస్థాయి విద్యా సంస్థను నెలకొల్పాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. తన కలను సాకారం చేసుకుంటూ 2001లో ఆయన మొహాలీలో చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలను స్థాపించారు. ఆ తరువాత మరో అడుగు ముందుకేసి 2012లో చండీగఢ్ యూనివర్సిటీని నెలకొల్పారు. ప్రపంచస్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో ఆయన చేసిన కృషితో యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 2023లో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో చండీగఢ్ యూనివర్సిటీకి చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా యూనివర్సిటీగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది.


చిన్నతనంలో కష్టాలు చవి చూసిన సత్నామ్ సింగ్ ఆ తరువాత దాతృత్వంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. నాణ్యమైన విద్య కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనందించారు.

సత్నామ్ సింగ్ వివిధ సామాజిక కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు. ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్, న్యూ ఇండియా డెవలప్మెంట్ ఫౌండేషన్ ఎన్జీఓలు స్థాపించి ప్రజారోగ్యం, సమాజంలో సౌభ్రాతృత్వం కోసం కృషి చేస్తున్నారు. దేశసమైక్యత కోసం ఎన్నారైలతో కలిసి పలు కార్యక్రమాలు చేస్తున్నారు.

సత్నామ్ సింగ్‌ సంధూకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ‘‘గొప్ప విద్యావేత్తగా, అట్టడుగు వర్గాల కోసం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తగా సత్నామ్ జీ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన పార్లమెంటరీ ప్రయాణం గొప్పగా సాగాలని ఆశిస్తున్నా’’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.

Updated Date - Jan 30 , 2024 | 05:51 PM