Share News

హరియాణాలో ఎన్నికల కుస్తీ!

ABN , Publish Date - Oct 03 , 2024 | 05:39 AM

హరియాణాలో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయా!? పదేళ్లుగా అధికారంలో ఉండడం ఆ పార్టీ, ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతోందా!? రైతులు, కుస్తీ యోధులు, నిరుద్యోగం, ముఠా తగాదాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు! దైనిక్‌

హరియాణాలో ఎన్నికల కుస్తీ!

కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ముఖాముఖి పోటీ.. ప్రతికూల పవనాల్లో కమలం ఎదురీత

జేజేపీ, ఐఎన్‌ఎల్‌డీ ప్రభావంపైనే ఆశలు

జవాన్‌, పహిల్వాన్‌, కిసాన్‌.. ఆ పార్టీ సవాళ్లు

న్యూఢిల్లీ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): హరియాణాలో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయా!? పదేళ్లుగా అధికారంలో ఉండడం ఆ పార్టీ, ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతోందా!? రైతులు, కుస్తీ యోధులు, నిరుద్యోగం, ముఠా తగాదాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు! దైనిక్‌ భాస్కర్‌ వంటి హిందీ పత్రికలతోపాటు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో హరియాణాలో బీజేపీ ఎంత బలంగా పోరాడినా 15-20 సీట్లు దక్కకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. బీజేపీ గట్టి పోటీ ఇస్తోందని చెబుతున్న వారే.. ఆ పార్టీ తప్పనిసరిగా గెలిచే స్థానాలు ఏమిటని అడిగితే కచ్చితంగా చెప్పలేకపోవడం కనిపిస్తోంది. నిజానికి, ఈ ప్రజా వ్యతిరేకతను గమనించే కేంద్ర నాయకత్వం ఆరు నెలల కిందట ముఖ్యమంత్రిని మార్చింది. ఎన్నికల సందర్భంగా సగానికిపైగా సిటింగ్‌ అభ్యర్థులనూ మార్చేసింది. అయినా, సత్ఫలితాలు రావడం లేదని బీజేపీ నేతలే వాపోతున్నారు. ఈ నేపథ్యంలో, ఓట్ల చీలికపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక్కడ ఇండి కూటమిలో భాగంగా కాంగ్రె్‌సతో పొత్తును తిరస్కరించి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. అలాగే, ఐఎన్‌ఎల్‌డీ-బీఎస్పీ కూటమి, జననాయక్‌ జనతా పార్టీ- ఆజాద్‌ సమాజ్‌ పార్టీ కూటమి సొంతంగా బరిలోకి సొంతంగా బరిలోకి దిగాయి. ఆయా పార్టీలు, కూటములు కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడంపైనే బీజేపీ ఇప్పుడు ఆశలు పెట్టుకుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ, త్రిశంకు అసెంబ్లీ ఏర్పడితే చిన్న పార్టీలు, స్వతంత్రులు కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించే అవకాశం ఉందని, కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఆ పరిణామం తమకు అనుకూలించే అవకాశం ఉందని బీజేపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. హరియాణాలో ముక్కోణపు పోటీ జరిగే అవకాశాలు ప్రతిసారీ తగ్గిపోతున్నాయని, ప్రజలు తమ ఓటును వృథా చేయడం లేదని కాంగ్రెస్‌ వర్గాలు వివరిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ముక్కోణపు పోటీ 49 స్థానాల్లో జరిగితే.. 2019 ఎన్నికలకు వచ్చేసరికి వాటి సంఖ్య 28 స్థానాలకు తగ్గిపోయిందని, ఈసారి వాటి సంఖ్య పదిలోపే ఉండవచ్చని విశ్లేషిస్తున్నాయి. హరియాణాలో దేవీలాల్‌ వారసుల పట్టు రోజురోజుకూ తగ్గిపోవడం కూడా పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పరిమితం కావడానికి కారణమని విశ్లేషిస్తున్నాయి.


దేవీలాల్‌ వారసత్వ పార్టీలైన జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ), ఐఎన్‌ఎల్‌డీ రెండింటికీ కలిపి గత లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 2.61 శాతం మాత్రమే. అదే సమయంలో, గత అసెంబ్లీ ఎన్నికల్లో జేజేపీ పది సీట్లలో విజయం సాధించింది. బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో జేజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, సాగు చట్టాలను చేసిన బీజేపీకి మద్దతు ఇవ్వడంతో జేజేపీపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇటు జేజేపీ మాత్రమే కాకుండా అటు ఐఎన్‌ఎల్‌డీ కూడా అన్ని సీట్లలో చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ ఎన్నికల్లో వీటి ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. బీజేపీ ప్రోద్బలంతోనే చిన్న చిన్న పార్టీలన్నీ తమతో తాము సర్దుబాటు చేసుకుని పోటీ చేస్తున్నాయని, కాంగ్రెస్‌ విజయావకాశాలను అవి దెబ్బ తీయలేవని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ సగానికి సగం సిటింగులను మార్చగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ తమ 31 మంది సిటింగ్‌ అభ్యర్థుల్లో 29 మందికి తిరిగి సీట్లు ఇచ్చింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన 17 మందికి మళ్లీ అవకాశాలు కల్పించింది.


వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రైతు ఆందోళనకు కేంద్ర బిందువైన హరియాణాలో రైతన్నలే ఈసారి ఫలితాలను నిర్ణయించనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎమ్మెస్పీ ధరకు హామీ ఇస్తామని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో ప్రకటించింది. సైనిక ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న యువత కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్‌ పథకం ద్వారా కేవలం నాలుగేళ్లే ఉపాధి కల్పిస్తామని చెప్పడంతో హతాశులయ్యారు. ప్రపంచ క్రీడల్లో పతకాలు సాధించి పెట్టిన హరియాణా మహిళా మల్లయోధుల పట్ల బీజేపీ వ్యవహరించిన తీరు కూడా ప్రజల్లో నిరసనను పెంచింది. దాదాపు ఏడాదిపాటు మహిళా మల్లయోధులు ఢిల్లీలో నిరసన తెలపడం.. వారికి పురుష పహిల్వాన్లు కూడా మద్దతు పలకడం బీజేపీకి ప్రతికూలంగా మారుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక, స్వతంత్రులు, తిరుగుబాటు అభ్యర్థుల మాటకొస్తే వారి సమస్య కాంగ్రెస్‌ కంటే బీజేపీకే ఎక్కువ ఉందని చెబుతున్నాయి. మరోవైపు, కాంగ్రె్‌సలో వర్గపోరు ఆ పార్టీని దెబ్బతీసే అవకాశం ఉందనే విశ్లేషణలు వెలువడ్డాయి. దళిత నేత షెల్జా కుమారి, మాజీ సీఎం భూపేందర్‌ హూడా మధ్య ఉన్న అంతర్గత తగాదాలు గత వారం వరకు ఆ పార్టీ నేతలకు కలవరం సృష్టించాయి. కానీ, రాహుల్‌ జోక్యంతో ఈ తగాదాలు సమసిపోయాయి. నాలుగు రోజుల కిందట కర్నాల్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌తోపాటు షెల్జా, హూడా ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకుని హాజరు కావడంతో ఆ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఆప్‌ ప్రభావం ఈ రాష్ట్రంలో అంతగా ఉండదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Updated Date - Oct 03 , 2024 | 05:39 AM