EPFO: ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.21 వేలకు!
ABN , Publish Date - Apr 12 , 2024 | 10:16 AM
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) పరిధిలోని ఉద్యోగుల వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఉద్యోగులకు సామాజిక భద్రతను విస్తరించడంలో భాగంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) పరిధిలోని ఉద్యోగుల వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఉద్యోగులకు సామాజిక భద్రతను విస్తరించడంలో భాగంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వేతన పరిమితిని పెంచాలనే డిమాండ్లు కొన్నేళ్లుగా ఉండగా, ఉద్యోగులు సైతం ఎప్పటినుంచో దీనికి అనుకూలంగా ఉన్నారు. ఈఎస్‌ఐసీ ఇప్పటికే వేతన పరిమితిని రూ.21వేలకు పెంచిన నేపథ్యంలో ఈపీఎఫ్‌ను కూడా ఆ మేరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
వేతన పరిమితిని చివరిగా 2014లో సవరించారు. అప్పట్లో ఈ పరిమితి రూ.6,500 ఉండగా దాన్ని కేంద్రం రూ.15,000కు పెంచింది. గరిష్ఠ వేతన పరిమితి పెంపుతో ఉద్యోగి, యాజమాన్యాలు చెల్లించే నెలవారీ చందా కూడా ఆ మేరకు పెరగనుంది. పీఎఫ్ ఖాతాకు జమ అయ్యే మొత్తం పెరగడంతో ఉద్యోగికి పదవీ విరమణ అనంతరం అధిక పెన్షన్ లభిస్తుంది.