Share News

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:54 AM

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో మంగళవారం ఉదయం మేఘ విస్పోటంతో వచ్చిన ఆకస్మిక వరదలతో ఒక పాదచారుల వంతెన, మూడు తాత్కాలిక షెడ్లు కొట్టుకుపోయాయి. కులు జిల్లా తోష్‌నాలాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు.

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు

కొట్టుకుపోయిన పాదచారుల వంతెన, షెడ్లు

షిమ్లా, జూలై 30 : హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో మంగళవారం ఉదయం మేఘ విస్పోటంతో వచ్చిన ఆకస్మిక వరదలతో ఒక పాదచారుల వంతెన, మూడు తాత్కాలిక షెడ్లు కొట్టుకుపోయాయి. కులు జిల్లా తోష్‌నాలాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. ప్రజలు నదులు, కాలువలకు దూరంగా ఉండాలని కులు డిప్యూటీ కమిషనర్‌ తొరల్‌ ఎస్‌. రవీష్‌ సూచించారు. అలాగే కాలువల పక్కన తాత్కాలిక నిర్మాణాలు చేపట్టవద్దని కోరారు. వర్షాకాలంలో ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టకూడదని, దీన్ని ఉల్లంఘించినవారిపై చర్యలు తప్పవన్నారు. బుధ, గురువారాల్లో ఈ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ కార్యాలయం హెచ్చరించింది. రానున్న నాలుగైదు రోజులు రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తాయని తెలిపింది. కులు, సోలన్‌, సిర్మార్‌, షిమ్లా, కినార్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడడంతోపాటు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ రాష్ట్రంలో ఈ ఏడాది జూన్‌ 27 నుంచి రుతుపవనాలతో వర్షాలు మొదలయ్యాక జరిగిన పలు ఘటనల్లో 62 మంది మృత్యువాత పడ్డారని అధికారిక సమాచారం.

Updated Date - Jul 31 , 2024 | 05:55 AM