Share News

బీమాపై జీఎస్టీ మినహాయింపు!

ABN , Publish Date - Oct 20 , 2024 | 05:27 AM

టర్మ్‌, ఆరోగ్య బీమాల ప్రీమియంపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో మంత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. టర్మ్‌ పాలసీలు, సీనియర్‌ సిటిజన్ల ఆరోగ్య బీమా

బీమాపై జీఎస్టీ మినహాయింపు!

టర్మ్‌ పాలసీల ప్రీమియంపై అందరికీ..

ఆరోగ్య బీమాపై సీనియర్‌ సిటిజన్లకు!

మిగతావారికి 5 లక్షల్లోపు కవరేజీ వరకు

20 లీటర్లు, ఆపై ప్యాకేజ్డ్‌ తాగునీరు,

10 వేలలోపు సైకిళ్లపై 5 శాతానికి తగ్గింపు

ఖరీదైన బూట్లు, వాచీలపై 28 శాతం

మంత్రుల సంఘం కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, అక్టోబరు 19: టర్మ్‌, ఆరోగ్య బీమాల ప్రీమియంపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో మంత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. టర్మ్‌ పాలసీలు, సీనియర్‌ సిటిజన్ల ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించాలని ప్రతిపాదించింది. సీనియర్‌ సిటిజన్లు మినహా మిగతావారికి రూ.5 లక్షల్లోపు కవరేజీ ఉండే ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని తీసేయాలని సిఫారసు చేసింది. కవరేజీ రూ.5 లక్షలు దాటిన పాలసీలకు చెల్లించే ప్రీమియంపై 18ు జీఎస్టీని కొనసాగించాలని సూచించింది. టర్మ్‌ పాలసీలపై అందరికీ జీఎస్టీ ఎత్తివేయాలని ప్రతిపాదించింది. వీటిపైనా ప్రస్తుతం 18ు జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ సిఫారసులపై త్వరలో జరిగే జీఎస్టీ మండలి భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారు. బీమా ప్రీమియంలపై జీఎస్టీ తొలగించాలన్న డిమాండ్లు వస్తున్న తరుణంలో గత నెల జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమైంది. దీనిపై చర్చించేందుకు మంత్రుల సంఘం ఏర్పాటైంది. కాగా, 20 లీటర్లు, అంతకుమించి ప్యాకేజ్డ్‌ తాగునీటిపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి, నోటు పుస్తకాలు, రూ.10వేల కంటే తక్కువ ధర సైకిళ్లపై 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని మంత్రుల సంఘం ప్రతిపాదించింది. రూ.15వేల కంటే ఎక్కువైన బూట్లు, రూ.25వేల కంటే ఖరీదైన చేతి గడియారాలపై జీఎస్టీని 18ు నుంచి 28శాతానికి పెంచాలని సిఫారసు చేసింది.

Updated Date - Oct 20 , 2024 | 05:27 AM