Surya Namaskar: 108 లొకేషన్లు, 4 వేల మంది జనం.. వరల్డ్ రికార్డ్ సృష్టించిన గుజరాత్
ABN , Publish Date - Jan 01 , 2024 | 02:44 PM
‘ఏదైనా నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్’ అనే సినిమా డైలాగ్ మన భారతీయులకు సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఎందుకంటే.. మనోళ్లు ఏదైనా...
Gujarat Surya Namaskar: ‘ఏదైనా నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్’ అనే సినిమా డైలాగ్ మన భారతీయులకు సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఎందుకంటే.. మనోళ్లు ఏదైనా కార్యం తలిస్తే, యావత్ ప్రపంచం మనవైపు చూసేలా దాన్ని విజయవంతం చేస్తారు. చరిత్రలో ఏ ఒక్కరికీ సాధ్యం కాని రీతిలో కనీవినీ ఎరుగని ఘనతలను సాధిస్తారు. ఇప్పుడు సూర్య నమస్కారం విషయంలో అలాంటి ఘనతనే గుజరాత్ రాష్ట్రం సాధించింది. ఏకకాలంలో 108 ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాలు చేసి.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది.
కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన ప్రసిద్ధ మోధేరా సూర్య దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లో 4 వేలకు మందికి పైగా ఈ సూర్య నమస్కార యోగా క్రమాన్ని ప్రదర్శించారు. 51 విభిన్న కేటగిరీల్లో ఈ సూర్య నమస్కారాల్ని ప్రదర్శించగా.. ఇందులో విద్యార్థులు, కొన్ని కుటుంబాలు, యోగా ఔత్సాహికులు, సీనియర్ సిటిజన్‌లతో పాటు విభిన్న సమూహాల నుంచి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో పాటు హోం మంత్రి హర్ష సంఘవి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ హాజరై.. సూర్య నమస్కారాల విషయంలో గుజరాత్ సరికొత్త ప్రపంచ రికార్డ్ నమోదు చేసిందని చెప్పారు. అత్యధిక మంది ఏకకాలంలో సూర్య నమస్కారం చేయడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు.
ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఒక అరుదైన ఘనతతో 2024 ఏడాదిని గుజరాత్ రాష్ట్రం స్వాగతించింది. 108 వేదికలపై ఏకకాలంలో అత్యధిక మంది సూర్య నమస్కారాలు చేసినందుకు గుజరాత్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. మన సంస్కృతిలో 108 సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్న విషయం అందరికీ తెలుసు. ఐకానిక్ మోధేరా సూర్య దేవాలయం వేదికగా ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా, మన సాంస్కృతిక వారసత్వం పట్ల మనకున్న నిబద్ధతకు ఇది నిజమైన నిదర్శనం’’ అని మోదీ చెప్పుకొచ్చారు. అలాగే.. సూర్య నమస్కారాన్ని ప్రతి ఒక్కరూ తమ రోజువారి దినచర్యలో భాగం చేసుకోవాలని ఆయన కోరారు.