SIT's Report: హాత్రాస్ తొక్కిసలాటలో ‘కుట్ర కోణం’..!
ABN , Publish Date - Jul 09 , 2024 | 01:58 PM
హాత్రాస్ తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం దాగి ఉండవచ్చని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది.
లఖ్‌నవూ, జులై 09: హాత్రాస్ తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం దాగి ఉండవచ్చని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. హాత్రాస్ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. దాదాపు 300 పేజీల నివేదికను మంగళవారం ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణాలు.. సత్సంగ్‌కు భారీగా ప్రజలు తరలిరావడం, ఈ సత్సంగ్ ఏర్పాటుపై నిర్వహాకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు భారీగా వచ్చిన భక్తులకు ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయక పోవడమేనని సిట్ తన నివేదికలో వివరించింది.
అలాగే స్థానిక పోలీసులతోపాటు జిల్లా అధికారులు సైతం ఈ ‘సత్సంగ్’ను పెద్దగా పట్టించుకోలేదని సిట్ పేర్కొంది. సిట్ తన దర్యాప్తులో భాగంగా 119 మంది వద్ద స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. అందులో బాధిత కుటుంబాలు, జిల్లా కలెక్టర్, ఎస్పీలతోపాటు ఇతర ఉన్నతాధికారుల స్టేట్‌మెంట్‌ను సైతం తీసుకుంది.
జులై 2వ తేదీన హాత్రాస్‌లో సురజ్ పాల్ సింగ్ అలియాస్ బోలే బాబా ‘సత్సంగ్’ నిర్వహించారు. దీనికి దాదాపు 2.5 లక్షల మంది హాజరయ్యారు. ఈ సత్సంగ్ అనంతరం చోటు చేసుకున్న తొక్కిసలాటలో 121 మంది మరణించారు. 28 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మరోవైపు ఈ తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా బోలే బాబా సత్సంగ్ ప్రధాన నిర్వహకుడు దేవ్ ప్రకాశ్ మధుకర్‌పై కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో జులై 5వ తేదీన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విచారణలో భాగంగా దేవ్ ప్రకాశ్‌కు పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. ఇక ఈ కేసులో బోలే బాబాపై కేసు నమోదు చేయకపోవడం కొసమెరుపు.
ఇంకోవైపు బోలే బాబా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ఈ తొక్కిసలాటకు ముందు కొంత మంది దుండగులు ఈ ‘సత్సంగ్’ ప్రదేశంలో విషాన్ని స్ప్రే చేశారన్నారన్నారు. ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న అనంతరం వారంతా అక్కడి నుంచి పారిపోయారని ఆయన ఆరోపించారు.
ఈ హాత్రాస్ తొక్కిసలాట కేసులో తొలుత ఉత్తరప్రదేశ్ జ్యూడిషియల్ కమిషన్ బృందం.. ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన విషయం విధితమే. హాత్రాస్ ఘటనలో ఆరుగురు ఉన్నతాధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.