Share News

మీ భాష సరే.. పనులే బాలేవు

ABN , Publish Date - Dec 17 , 2024 | 05:46 AM

రాజ్యాంగంపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చ అధికార, విపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధాన్ని రాజేసింది.

మీ భాష సరే.. పనులే బాలేవు

మీరు జేఎన్‌యూ..నేను మున్సిపల్‌ స్కూల్‌.. రాసింది చదవడం నాకు కూడా వచ్చు

నిర్మలా సీతారామన్‌పై ఖర్గే విసుర్లు

కుటుంబం కోసమే రాజ్యాంగ సవరణలు

కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి నిర్మల నిప్పులు

రాజ్యసభలో వాడీవేడిగా రాజ్యాంగ చర్చ..

న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగంపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చ అధికార, విపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధాన్ని రాజేసింది. ఈ చర్చ సందర్భంగా కాంగ్రె్‌సపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విరుచుకుపడగా, నిర్మలను ఉద్దేశించి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పదునైన విమర్శల దాడిని సాగించారు. దీంతో రాజ్యాంగంపై చేపట్టిన చర్చ రాజ్యసభను వేడెక్కించింది. తమ నేతలను కాపాడుకోడానికీ, కుటుంబం, రాజకీయ వంశ పరిరక్షణకూ తప్ప ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ‘వృద్ధ రాజకీయ పార్టీ’ (కాంగ్రెస్‌) ఏనాడూ రాజ్యాంగ సవరణ చేయలేదని మంత్రి నిర్మలా సీతారామన్‌ ధ్వజమెత్తారు. మాజీ ప్రధానమంత్రులు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ నుంచి నేటివరకు... 42వ రాజ్యాంగ సవరణ నుంచి షాబానో ఉదంతంలో చేసిన సవరణ దాకా.. కాంగ్రె్‌సది ఇదే తంతు అని విమర్శించారు. ‘‘భావ ప్రకటన స్వేచ్ఛను రాజ్యాంగంలో పొందుపరచడం పట్ల దేశం గర్విస్తుంది. కానీ, అప్పటి తొలి మధ్యంతర ప్రభుత్వం ఈ స్వేచ్ఛకు నియంత్రణలు విధిస్తూ రాజ్యాంగ సవరణ తెచ్చింది. రాజ్యాంగాన్ని ఆమోదించి అప్పటికి ఒక ఏడాది కూడా కాలేదు’’ అని నిర్మల తీవ్ర స్వరం వినిపించారు. ఆమె వ్యాఖ్యలపై ఖర్గే అంతే దీటుగా స్పందించే ప్రయత్నం చేశారు. ‘‘నేను మునిసిపల్‌ స్కూలులో చదివాను.

రాసిచ్చింది చదవడం నాకు కూడా వచ్చు. ఆమె జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో చదివారు. ఆమె మాట్లాడే ఇంగ్లీష్‌, హిందీ సహజంగానే బాగుంటాయి. కానీ, పనులే ఏమీ బాగా లేవు’’ అని ఖర్గే విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని, జాతీయజెండాను, అశోకచక్రను ద్వేషించిన చరిత్ర కలిగినవారు.. తమకు పాఠాలు చెప్పాలని చూడటం ఆశ్చర్యపరుస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున వీళ్లు (నిర్మలను ఉద్దేశించి) దానిని తగలబెట్టారు. అంబేడ్కర్‌, నెహ్రూ, గాంధీల దిష్టిబొమ్మలకు ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ఆ రోజున నిప్పుపెట్టారు’’ అని ఖర్గే ఆరోపించారు. స్ర్తీ, పురుష వివక్ష లేకుండా అందరికీ సార్వత్రిక వయోజన ఓటుహక్కును కల్పించిన ఘనత ‘వృద్ధ రాజకీయ పార్టీ’, రాజ్యాంగాలదేనని, అప్పటికి మహిళలకు ఓటుహక్కు గురించిన ఆలోచనే ప్రపంచంలోని అత్యధిక దేశాలకు లేదన్నారు. ఈ నిర్ణయాన్ని ఆనాడు ఆర్‌ఎ్‌సఎస్‌, జన్‌సంఘ్‌ వ్యతిరేకించాయని ఖర్గే విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎ్‌సకు చెందిన పూర్వ నాయకులు రాజ్యాంగాన్ని వ్యతిరేకించారనేది సుస్పష్టమన్నారు.


రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం

రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, కుల గణన చేపట్టకపోవడానికి అదే కారణమని ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను ఆర్‌ఎ్‌సఎస్‌ అంగీకరించలేదని, అందుకే 2002 జనవరి 26న ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించాలని న్యాయస్థానం ఆదేశించిందని ఖర్గే తెలిపారు. రిజర్వేషన్‌ అంశంపై రాష్ట్రాలకు నెహ్రూ లేఖలు రాయడం సహా అనేక అంశాల్లో వాస్తవాలను ప్రధాని మోదీ వక్రీకరించి దేశాన్ని తప్పుదారి పట్టించారని ఖర్గే ఆరోపించారు. ఇందుకుగాను దేశానికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రియాంక భుజాన ‘పాలస్తీనా’ బ్యాగ్‌

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ‘పాలస్తీనా’ అనే పదం ముద్రించబడి వున్న బ్యాగ్‌ను భుజాన వేసుకొని సోమవారం పార్లమెంట్‌కు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రియాంక ఆ బ్యాగ్‌ను ధరించి ఉన్న ఫొటోను కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి షామా మహమ్మద్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. ప్రత్యేక బ్యాగ్‌ను ధరించడం ద్వారా ఆమె పాలస్తీనాకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. దీనిపైౖ బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిఽధి సంభిత్‌ పాత్ర స్పందించారు. గాంధీ కుటుంబం విషయానికి వస్తే ఇదేమీ కొత్త కాదని, నెహ్రూ నుంచి ప్రియాంక వరకు గాంధీ కుటుంబసభ్యులు ‘బుజ్జగింపు’ బ్యాగ్‌లతో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.

Updated Date - Dec 17 , 2024 | 05:46 AM