Hemant Soren: సోరెన్ విషయంలో 20 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. నాడు తండ్రి శిబు కూడా ఇలాగే..!
ABN , Publish Date - Jan 30 , 2024 | 08:42 PM
సుమారు 20 ఏళ్ల క్రితం శిబు సోరెన్ తండ్రి కూడా కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయి కలకలం రేపారు.
ఇంటర్నెట్ డెస్క్: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కనిపించకుండా పోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ తరువాత మీడియా ముందుకు వచ్చిన ఆయన తాను ఎక్కడికీ వెళ్లలేదని వివరణ ఇచ్చారు. ఈడీ విచారణకు వస్తున్న సమయంలోనే ఆయన అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో బీజేపీకి విమర్శలు ఎక్కుపెట్టేందుకు అవకాశం చిక్కింది. అరెస్టు భయంతోనే ఆయన పారిపోయారంటూ కమలం పార్టీ విమర్శలు గుప్పించింది. ఇదంతా గమనించిన విమర్శకులు, నెటిజన్లు హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ ప్రస్తావన తెచ్చారు. 2004లో ఆయన కూడా ఇలాగే అకస్మాత్తుగా కనిపించకుండా పోయి కలకలం రేపిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు.
అప్పుడేం జరిగిందంటే..
2004లో శిబు సోరెన్..మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పనిచేసేవారు. అప్పటికి కొన్ని దశాబ్దాల క్రితం ఝార్ఖండ్‌లో చిరుదిలో జరిగిన ఘర్షణలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనకు సంబంధించి 2004లో శిబును అరెస్టు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆయన కనిపించకుండా పోవడంతో పోలీసులు ఝార్ఖండ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు 10 రోజుల తరువాత రాంచీలో ఆయన కనిపించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఝార్ఖండ్ అడవుల్లోని గ్రామాలకు వెళ్లానని చెప్పుకొచ్చారు. ఇక అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
హేమంత్ సోరెన్ విషయంలో కూడా దాదాపుగా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. గతవారం వ్యక్తిగత పనులపై హేమంత్ సోరెన్ రాంచీ నుంచి ఢిల్లీ వెళ్లారు. దీంతో, ఈడీ అధికారులు సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన కార్యాలయానికి చేరుకోగా అక్కడ సీఎం లేరు. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన ఆయన మళ్లీ ఈ మధ్యాహ్నం రాంచీలో కనిపించారు.