Mithun Chakraborty: దెయ్యంలా తిన్నందుకు అడ్డం పడ్డా...
ABN , Publish Date - Feb 12 , 2024 | 07:42 PM
తీవ్ర అస్వస్థతతో ఈనెల 10న కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి సోమవారం మధ్యాహ్నం డిశ్చార్చ్ అయ్యారు. మెదడుకు సంబంధించిన ''ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్''తో ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన మిథున్...తన అస్వస్థతకు దెయ్యంలా తినడమే కారణమని అన్నారు.
కోల్‌కతా: తీవ్ర అస్వస్థతతో ఈనెల 10న కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) సోమవారం మధ్యాహ్నం డిశ్చార్చ్ అయ్యారు. మెదడుకు సంబంధించిన ''ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్''తో ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన మిథున్...తన అస్వస్థతకు కారణం ఏమిటో చెప్పారు. తన సలహాను అందరూ పాటించాలని కోరారు.
''ఒక దెయ్యంలా (Demon) తినేవాడిని. అందుకు శిక్ష అనుభవించాను. ప్రతి ఒక్కరూ మితాహారం (Diet control) తీసుకోవాలనేది నా సలహా. మధుమేహం ఉన్నవారు స్వీట్లు తింటే ఏమీ కాదనే అపోహలో ఉండొద్దు. డయిట్ కంట్రోల్ ఉండాల్సిందే'' అని మిధున్ వ్యాఖ్యానించారు
బీజేపీ కోరితో అన్నిరాష్ట్రాల్లో ప్రచారం..
పశ్చిమబెంగాల్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై అడిగినప్పుడు, 42 లోక్‌సభ నియోజవర్గాల్లోనూ బీజేపీ తరఫున చురుకుగా పనిచేస్తానని చెప్పారు. పార్టీ కోరితే ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారానికి వెళ్తానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, బీజేపీ అఖండ విజయాలను సొంతం చేసుకునేందుకు ఇదే తగిన సమయమని మిథున్ చక్రవర్తి చెప్పారు.
మా తండ్రి కోలుకున్నారు..
కాగా, తన తండ్రి ఇప్పుడు చక్కటి ఆరోగ్యంతో ఉన్నారని, ఆయన కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని మిధున్ చక్రవర్తి కుమారుడు నమషి చక్రవర్తి 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. మిధున్ చక్రవర్తికి ఇటీవల భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రదానం చేసింది. ఇటీవల 'కాబూలీవాలా' అనే చిత్రంలో మిధున్ చక్రవర్తి వెండితెరపై కనిపించారు.