Canada-India: కెనడాపై కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 03 , 2024 | 09:18 AM
భారత్ - కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత కాన్సులర్ సిబ్బందిని కెనడా వేధింపులు, బెదిరింపులకు గురిచేస్తోందని మండిపడింది.
న్యూఢిల్లీ: భారత్ - కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత కాన్సులర్ సిబ్బందిని కెనడా వేధింపులు, బెదిరింపులకు గురిచేస్తోందని మండిపడింది. తమ అధికారులను ఆడియో, వీడియో నిఘాలో ఉంచి దౌత్య ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించిందని ఆరోపించింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాలోని భారత కాన్సులర్ అధికారులు ఆడియో, వీడియో నిఘా పరిధిలో ఉంటుంటున్నట్టు వెల్లడైందని, ఈ మేరకు కెనడా ప్రభుత్వానికి అధికారికంగా నిరసన తెలియజేసినట్లు ఆయన వివరించారు.
దౌత్యపరమైన ప్రతిష్టంభన నేపథ్యంలో కెనడాలోని చాలా మంది భారతీయ దౌత్య అధికారులు నిఘాలో ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి నిజమేనా అని ప్రశ్నించగా రణధీర్ జైస్వాల్ స్పందించారు. ‘‘అవును. మన కాన్సులర్ అధికారులలో కొందరు ఆడియో, వీడియో నిఘాలో ఉన్నారని, అలాగే కొనసాగుతారని కెనడా ప్రభుత్వం సదరు అధికారులకు ఇటీవల తెలిపింది. అధికారుల సంభాషణలను నియంత్రిస్తున్నారు. ఈ చర్యలపై కెనడా ప్రభుత్వానికి అధికారికంగా నిరసన తెలిపాం. నిఘా ఉంచడం ద్వారా సంబంధిత దౌత్య ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించారు’’ అని జైస్వాల్ వివరించారు.
టెక్నికల్ కారణాలను చూపించడం ద్వారా ఈ వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న కెనడా ప్రభుత్వం వాస్తవాన్ని సమర్థించుకోలేదని జైస్వాల్ అన్నారు. అక్కడ ఉన్న మన దౌత్య, కాన్సులర్ సిబ్బంది ఇప్పటికే తీవ్రవాదం, హింసాత్మక వాతావరణంలో పనిచేస్తున్నారని, స్వయంగా కెనడా ప్రభుత్వం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోందని మండిపడ్డారు.
మరోవైపు రష్యా, చైనా, ఉత్తర కొరియాతో పాటు భారత్‌ను కూడా ‘సైబర్ శత్రువు’గా ఇటీవల కెనడా వర్గీకరించిందని, అక్కడి నెలకొన్న పరిస్థితికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. భారత్‌పై దాడి చేసేందుకు కెనడా వ్యూహానికి ఇది మరో ఉదాహరణగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తాను గతంలో చెప్పినట్టుగా భారత్‌కు వ్యతిరేకంగా ప్రపంచ అభిప్రాయాన్ని తారుమారు చేయడానికి కెనడా సీనియర్ అధికారులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ మేరకు వారు బహిరంగంగా అంగీకరించారని, గతంలో మాదిరిగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు గుప్పిస్తున్నారని జైస్వాల్ పేర్కొన్నారు.
కాగా ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్‌లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలు అసంబద్ధమైనవని, ప్రేరేపితమైనవని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసిన విషయం తెలిసిందే.