Share News

అమెరికాకు మన విద్యార్థులు ఇచ్చింది.. అక్షరాలా రూ.లక్ష కోట్లు!

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:49 AM

గతేడాది అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీయ విద్యార్థులు 1180 కోట్ల డాలర్లు అందించారు.

అమెరికాకు మన విద్యార్థులు ఇచ్చింది.. అక్షరాలా రూ.లక్ష కోట్లు!

అగ్రరాజ్యంలో 3.31 లక్షల మంది భారతీయుల విద్యాభ్యాసం

15 ఏళ్ల తర్వాత చైనాను దాటి నెంబర్‌వన్‌ స్థానంలో మనం

వాషింగ్టన్‌, నవంబరు 19: గతేడాది అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీయ విద్యార్థులు 1180 కోట్ల డాలర్లు అందించారు. ఇది అక్షరాలా దాదాపు రూ.లక్ష కోట్లకు సమానం. కచ్చితంగా చెప్పాలంటే రూ.99,581 కోట్లు. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికం. వారి సంఖ్య 3,31,692. గతేడాది కంటే ఇది 23ు అధికం. సంఖ్యాపరంగా చైనాను (ఆ దేశ విద్యార్థులు 2.7 లక్షలు) కూడా ఈసారి మనం అధిగమించాం. గతంలో అమెరికాలో విదేశీ విద్యార్థుల పరంగా భారత్‌ నెంబర్‌వన్‌ స్థానంలో ఉండేది. కానీ, చైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. 15 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. ‘ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌, 2024’ పేరుతో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి విడుదలైన ఒపెన్‌డోర్స్‌ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. అమెరికాలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌’ అనే సంస్థ ప్రభుత్వ సహకారంతో సర్వే జరిపి ఈ నివేదికను విడుదల చేస్తుంది. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం, ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వచ్చిన భారతీయ విద్యార్థుల్లో 64.5ు మంది ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరగా, మిగిలిన 35.5ు మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరారు. ఇక సబ్జెక్టుల వారీగా చూస్తే.. ఐటీ తదితర ఇంజనీరింగ్‌ కోర్సుల్లో 67.4ు మంది, బిజినెస్‌ మేనేజిమెంట్‌లో 11.2ు మంది, సైన్స్‌ కోర్సుల్లో 5.4ు మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో గ్రాడ్యుయేట్‌ కోర్సులు చేస్తున్న వారే ఎక్కువ (దాదాపు రెండు లక్షల మంది). విద్యాభ్యాసం అనంతరం ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌’ (ఓపీటీ)లో కొనసాగుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది (దాదాపు లక్ష మంది). కాగా, భారత విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోల్చితే 23ు పెరగగా, చైనా విద్యార్థుల సంఖ్య 4ు తగ్గటం విశేషం.

విదేశీ విద్యార్థులతో రూ.4.21 లక్షల కోట్లు

2023లో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో 6ు మంది (11 లక్షల మందికిపైగా) విదేశాల నుంచి వచ్చిన వారు. వీరంతా కలిసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు 5 వేల కోట్ల డాలర్ల (రూ.4,21,953 కోట్లు) భారీ మొత్తాన్ని అందజేశారు. అమెరికాలో విదేశీ విద్యార్థులు చదువుకుంటున్న టాప్‌-3 రాష్ట్రాల్లో కాలిఫోర్నియా, న్యూయార్క్‌, టెక్సాస్‌ ఉన్నాయి. భారత్‌, చైనా, బంగ్లాదేశ్‌, కొలంబియా, ఘనా, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌, స్పెయిన్‌ల నుంచి ఎక్కువగా విద్యార్థులు అమెరికాకు తరలి వస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆఫ్రికా దేశాల విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీనిపై అమెరికా విద్యా, సాంస్కృతిక వ్యవహారాల విభాగం సీనియర్‌ అధికారి స్కాట్‌ విన్‌హోల్డ్‌ స్పందిస్తూ.. ‘అమెరికాలో విద్యాభ్యాసం ఆయా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దారి వేయటమే కాదు, పరస్పరం అనుసంధానమైన ప్రస్తుత ప్రపంచం భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతోంది’ అని పేర్కొన్నారు. కాగా, అమెరికాలోనే కాదు.. బ్రిటన్‌లోనూ భారతీయ విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఆ దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో 1.7 లక్షల మందితో భారతీయులే నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 04:50 AM