Washington: సునీతా.. ముచ్చటగా మూడోసారి
ABN , Publish Date - May 07 , 2024 | 03:46 AM
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌తో కలిసి బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో ఆమె రోదసీలోకి వెళ్లనున్నారు.
అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారత సంతతి వ్యోమగామి
నేటి ఉదయం 8.04 గంటలకు రోదసీ యాత్ర
వాషింగ్టన్, మే 6: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌తో కలిసి బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో ఆమె రోదసీలోకి వెళ్లనున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం (మే 7) ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌక అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎ్‌సఎ్‌స)కు బయల్దేరనుంది. సునీత విలియమ్స్ ఇప్పటికే రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. తాజా యాత్రలో ఆమె మిషన్ పైలట్‌గా వ్యవహరించనున్నారు. తానొక ఆధ్యాత్మిక వాదినని, తనకు వినాయకుడు అంటే ఇష్టమని.. అందుకే ఈ సారికూడా తాను అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు తనతోపాటు వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నానని సునీతా విలియమ్స్ చెప్పారు. కాగా, బోయింగ్ కంపెనీ ఇప్పటి వరకూ మానవ రహిత అంతరిక్ష యాత్రలు చేపట్టగా.. తొలిసారి మానవ సహిత యాత్రకు సిద్ధమైంది.
సెమీ క్రయోజెనిక్ ఇంజన్‌కు ప్రీ బర్నర్ పరీక్ష సక్సెస్
బెంగళూరు, మే 6: భవిష్యత్తులో తాము ప్రయోగించే రాకెట్లను మరింత శక్తిమంతంగా మార్చుకునే ప్రణాళికలో భాగంగా 2000 కిలోన్యూటన్ల (కేఎన్) సామర్థ్యం కలిగిన సెమీ క్రయోజెనిక్ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు ఇస్రో సోమవారం తెలిపింది. ఇందులో భాగంగా సెమీ క్రయో ప్రీ బర్నర్‌ను విజయవంతంగా పరీక్షించామని పేర్కొంది. టర్బోపంప్స్ మినహా ఇంజిన్ పవర్ హెడ్ వ్యవస్థకు అనుబంధంగా ఉండే ప్రీ-బర్నర్ ఇగ్నీషన్ ట్రయల్‌ను మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో నిర్వహించారు.