Kolkata: బెంగాల్ రాజ్‌భవన్ ఉద్యోగుల విచారణ..
ABN , Publish Date - May 05 , 2024 | 04:07 AM
శ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ తనను లైంగికంగా వేధించారంటూ రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి చేసిన ఫిర్యాదుపై కోల్‌కతా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కోల్‌కతా, మే 4: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ తనను లైంగికంగా వేధించారంటూ రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి చేసిన ఫిర్యాదుపై కోల్‌కతా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కోల్‌కతా సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఇందిరా ముఖర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక విచారణ బృందం శుక్రవారం నుంచే పని ప్రారంభించింది. శనివారం రాజ్‌భవన్‌కు చెందిన నలుగురు ఉద్యోగులను పిలిపించి విచారణ జరిపింది. రాజ్‌భవన్‌కు చెందిన సీసీటీవీ కెమేరా ఫుటేజీలను ఇవ్వాలని కోరింది.
రానున్న రోజుల్లో మరికొందర్ని విచారించే అవకాశం ఉంది. గవర్నర్‌పై పోలీసు కేసు నమోదైనప్పటికీ రాజ్యాంగపరమైన రక్షణ ఉండడంతో ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం లేదు. రాజ్యాంగంలోని 361(2) అధికరణం ప్రకారం గవర్నర్ పదవిలో ఉన్నంతకాలం ఆయనపై ఏ కోర్టులోనూ ఎలాంటి క్రిమినల్ చర్య లు తీసుకోవడానికి వీల్లేదు. మరోవైపు రాజ్‌భవన్‌లోకి పోలీసులు ప్రవేశకూడదంటూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గవర్నర్‌పై ఫిర్యాదు చేయడం దురుద్దేశపూరితమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫిర్యాదు చేసిన ఆ మహిళకు అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రె్‌సతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ, సీపీఎంలు చెబుతున్నాయి.