Delhi: రఫాపై ఇజ్రాయెల్ దాడి
ABN , Publish Date - May 07 , 2024 | 04:15 AM
ముందుగా హెచ్చరించినట్లుగానే గాజా-ఈజిప్ట్ సరిహద్దు నగరం రఫాపై ఇజ్రాయెల్ సోమవారం దాడులు ప్రారంభించింది.
సెంట్రల్‌గాజా/టెల్ అవీవ్, మే 6: ముందుగా హెచ్చరించినట్లుగానే గాజా-ఈజిప్ట్ సరిహద్దు నగరం రఫాపై ఇజ్రాయెల్ సోమవారం దాడులు ప్రారంభించింది. గాజాపై ఇజ్రాయెల్ భూతల దాడులు ప్రారంభమయ్యాక.. పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయమిస్తున్న రఫాలో నక్కిన హమాస్ నేతల ఏరివేత పేరుతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) ముందుకు సాగుతోంది. ఆదివారం హమాస్ జరిపిన కాల్పుల్లో నలుగురు ఐడీఎఫ్ సైనికులు మృతిచెందడంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో భేటీ అయిన అత్యవసర యుద్ధ క్యాబినెట్..రఫాపై దాడికి ఏకగ్రీవంగా ఆమోదించింది.
హమాస్ తాజా దాడితో చర్చలకు విఘాతమేర్పడిందని క్యాబినెట్ అభిప్రాయపడింది. దీంతో సోమవారం ఉదయం నుంచే రఫాలోని శరణార్థులను సముద్రతీర ప్రాంతమైన మువాసి నగరానికి తరలించడం ప్రారంభించింది. సాయంత్రం సమయంలో ఐడీఎఫ్ వర్గాలు తూర్పు రఫాపై డ్రోన్ దాడులను ప్రారంభించాయి. రఫాపై దాడి యత్నాన్ని మానుకోవాలంటూ అమెరికా, ఫ్రాన్స్, ఐరోపా సమాఖ్య, ఇతర దేశాలు కోరినా ఇజ్రాయెల్ పట్టించుకోకపోవడం గమనార్హం..! కాగా.. కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే సోమవారం సాయంత్రం ప్రకటించారు. ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.