ISRO Chief Somanath: ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్.. ఆదిత్య-ఎల్1 లాంచింగ్ రోజునే..
ABN , Publish Date - Mar 04 , 2024 | 05:22 PM
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation-ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ (S Somanath) తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. సోలార్ మిషన్ ‘ఆదిత్య-ఎల్1’ (Aditya-L1) లాంచింగ్ రోజున తనకు క్యాన్సర్ (Cancer) ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation-ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ (S Somanath) తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. సోలార్ మిషన్ ‘ఆదిత్య-ఎల్1’ (Aditya-L1) లాంచింగ్ రోజున తనకు క్యాన్సర్ (Cancer) ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. తార్మాక్ మీడియా హౌస్‌కి ఇచ్చిన మలయాళ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 (Chandrayaan-3) సమయంలోనే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, అయితే ఆదిత్య-ఎల్ మిషన్ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకున్నాక క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని అన్నారు.
ఎస్ సోమనాథ్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘చంద్రయాన్-3 ప్రయోగం సమయంలోనే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అయితే.. ఆ సమయంలో నాకు దానిపై స్పష్టమైన అవగాహన లేదు. కానీ.. ఆదిత్య-ఎల్1 మిషన్ ప్రయోగించిన ఉదయమే నేను వైద్య పరీక్షలు చేయించుకున్నాను. ఈ పరీక్షల్లో ఏదో సమస్య ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆదిత్య-ఎల్1 ప్రయోగం ముగిశాక నేను చెన్నై వెళ్లి మరిన్ని స్కాన్‌లు చేయించాను. అప్పుడే నా కడుపులో కణితి పెరిగిందన్న విషయం నాకు తెలిసింది. రెండు, మూడు రోజుల తర్వాత నేను క్యాన్సర్ బారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులతో పాటు సహోద్యోగులు షాక్‌కు గురయ్యారు’’ అని చెప్పుకొచ్చారు.
ఈ వ్యాధి తనకు వంశపారంపర్యంగా వచ్చినట్లు పరీక్షల్లో తేలిందన్న ఆయన.. ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నానని ఎస్ సోమనాథ్ స్పష్టం చేశారు. ఆదిత్య ఎల్1 ప్రయోగం చేపట్టాక తనను ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారని.. వారి సూచన మేరకు శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ (Chemotherapy) చేయించుకున్నానని తెలిపారు. తొలుత కాస్త కంగారు పడినప్పటికీ.. క్యాన్సర్‌కు పూర్తి పరిష్కారంగా చికిత్స ఉందన్న విషయంపై తనకు అవగాహన వచ్చిందని చెప్పారు. తానిప్పుడు పూర్తిగా కోలుకున్నానని, తిరిగి విధుల్లోకి చేరానని అన్నారు. అయితే.. ప్రతి సంవత్సరం రెగ్యులర్ చెకప్‌లు, స్కానింగ్‌లు చేయించుకుంటానని సోమనాథ్ చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి