అంగరంగ పెళ్లిళ్లపై ఐటీ చూపు
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:48 AM
భారీ సెట్టింగు.. డెస్టినేషన్ వెడ్డింగ్.. సినీ తారల సందడి.. కోట్లు ఖర్చు అయినా వెనుకాడకుండా ఆతిథ్యం..
న్యూఢిల్లీ, డిసెంబరు 20: భారీ సెట్టింగు.. డెస్టినేషన్ వెడ్డింగ్.. సినీ తారల సందడి.. కోట్లు ఖర్చు అయినా వెనుకాడకుండా ఆతిథ్యం.. ఇలా అంగరంగ వైభోగంగా జరిగే పెళ్లిళ్లపై ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టింది. పన్ను లెక్కల్లో చూపని నగదును ఈ కల్యాణాల్లో ఖర్చు చేస్తున్నట్లు పసిగట్టింది. ఇలాంటి డబ్బు గతేడాది కాలంలో రూ. 7,500 కోట్లకుపైగా ఖర్చు పెట్టారని లెక్కగట్టింది. ఆ విలాసవంతమైన వెడ్డింగ్‌లకు జైపూర్ కేంద్రమని గుర్తించిన ఆదాయ పన్ను అధికారులు.. ఇక్కడి టాప్ 20 వెడ్డింగ్ ప్లానర్ల లెక్కలు బయటకు తీస్తోంది. వీరిని ఇతర ప్రాంతాల వెడ్డింగ్ ప్లానర్లు సంప్రదిస్తారని అధికారులు గుర్తించారు. జైపూర్‌లో భారీ పెళ్లిళ్ల కోసం మ్యూల్ ఖాతాలు, హవాలా ఏజెంట్లు, నకిలీ బిల్లుల సృష్టి కర్తలతో కూడిన ఓ నెట్‌వర్క్ పనిచేస్తోందని, ఈ నెట్‌వర్క్‌కు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోని సహచరులతో సంబంధాలు ఉన్నాయని కనిపెట్టారు.