2029లో జమిలి!
ABN , Publish Date - Mar 15 , 2024 | 05:31 AM
దేశంలో జమిలి ఎన్నికలు జరపాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది.
మూడంచెల ఎన్నికలు 2 దశల్లో జరపాలి
తొలుత లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు
తర్వాత వంద రోజుల్లో స్థానిక సంస్థలకు
‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’కు పచ్చజెండా!
రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు
రాష్ట్రపతి ముర్ముకు 18 వేల పేజీల నివేదిక
హంగ్ ఏర్పడినా.. అవిశ్వాసం నెగ్గినా..
లోక్‌సభకు మళ్లీ ఎన్నికలు
సర్కారు పదవీకాలం ఆ టర్మ్ ముగిసేదాకే
అసెంబ్లీలు మధ్యలో రద్దయి, ఎన్నికలు వస్తే
వాటి గడువు లోక్‌సభ టర్మ్ పూర్తయ్యేదాకే
ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి
దేశమంతా ఒకే ఓటర్ల జాబితా, ఐడీ కార్డు
ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫారసులు
ఇక ఎన్నికలే ఉండవు.. కాంగ్రెస్ విమర్శ
న్యూఢిల్లీ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): దేశంలో జమిలి ఎన్నికలు జరపాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ కింద 2029లో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. మూడంచెల విధానంలో.. లోక్‌సభ, అసెంబ్లీలు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక సంస్థలకు.. రెండు దశల్లో ఎన్నికలు జరపాలని పేర్కొంది. చట్టసభల ఎన్నికలు ముగిసిన తర్వాత వంద రోజుల్లో దేశంలోని స్థానిక సంస్థలన్నిటికీ ఎన్నికలు జరపాలని సూచించింది. సుపరిపాలనకు, శీఘ్ర అభివృద్ధికి జమిలి ఎన్నికలు మంచివంటూ పలు కీలక సిఫారసులతో కూడిన 18,626 పేజీల భారీ నివేదికను కోవిం ద్ గురువారమిక్కడ రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ద్రౌప ది ముర్మును కలిసి అందజేశారు. ఆయన వెంట ప్యానె ల్ సభ్యులైన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్, న్యాయకోవిదుడు హరీశ్ సాల్వే, మాజీ సీవీసీ సంజయ్ కొఠారీ కూడా ఉన్నారు. ఏకకాలంలో ఎన్నికలు జరపడం వల్ల అభివృద్ధి వేగమవుతుందని.. ప్రజాస్వామిక పునాదులను బలోపేతం చేస్తుందని కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. ‘ఇండియా అంటే భారత్’ ఆకాంక్షలు నెరవేర్చడానికి తోడ్పడుతుందని తెలిపింది. దేశంలో ఏటా పలు ఎన్నికల కారణంగా ప్రభుత్వం, వ్యాపారాలు, ఉద్యోగులు, కోర్టులు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులపైన.. అన్నిటికీ మించి పౌరసమాజంపైన పెనుభారం పడుతోందని పేర్కొంది. ఒక దేశం-ఒకే ఎన్నిక విధానం అమలు కోసం చేపట్టే ఏ రాజ్యాంగ సవరణకూ రాష్ట్రాల ఆమోదం తీసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. కమిటీ కీలక సిఫారసులివీ..
ప్రభుత్వం కూలిపోతే..
సార్వత్రిక ఎన్నికల్లో త్రిశంకు సభ ఏర్పడి లేదా అవిశ్వాస తీర్మానం నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోయినా.. ఏ కారణంగానైనా ప్రభు త్వం కుప్పకూలినా కొత్తగా లోక్‌సభ ఎన్నికలు జరపాల్సి వస్తుంది. అప్పుడు దాని పదవీకాలం.. మునుపు ఎన్నిక లు జరిగిన లోక్‌సభటర్మ్ పూర్తయ్యేవరకే ఉంటుంది.
రాష్ట్రాల శాసనసభలకు తాజా ఎన్నికలు జరిగితే.. (అవి రద్దయితే తప్ప) వాటి పదవీకాలం లోక్‌సభ పూర్తి టర్మ్ వరకు కొనసాగుతుంది. ఉదాహరణకు ఒక రాష్ట్రప్రభుత్వం తన రెండో ఏట అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి కూలిపోతే వెంటనే ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆ ప్రభుత్వం మిగతా మూడేళ్లు మాత్రమే కొనసాగుతుంది.
ఈ మార్పులకు సంబంధించిన నియమావళిని అమల్లోకి తీసుకురావడానికి రాజ్యాంగంలోని 83వ అధికరణ (పార్లమెంటు ఉభయ సభల పదవీకాలాన్ని నిర్వచిస్తుంది), 172వ అధికరణ (రాష్ట్రాల శాసనసభల పదవీకాలానికి సంబంధించినది)లను సవరించాల్సి ఉంటుంది. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు వీలుగా రాజ్యాంగంలో 82ఏ అధికరణను చేర్చాలి. అయితే స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ఆ మేరకు చేసే సవరణకు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి.
ఒకే ఓటరు జాబితా..
లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలకు పౌరులందరికీ ఒకే ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. స్థానిక ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో సంప్రదింపులు జరిపి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వీటిని తయారు చేయా లి. ఇందుకోసం 325వ అధికరణను సవరించాలి.
ఏకకాలంలో అన్ని ఎన్నికలు జరిపే విధానం పునరుద్ధరణకు.. చట్టబద్ధమైన యంత్రాంగాన్ని/వ్యవస్థను ప్రభుత్వం రూపొందించాలి.
82ఏ అధికరణను తీసుకొచ్చిన తర్వాత ఏర్పడిన అసెంబ్లీల పదవీకాలం లోక్‌సభ పదవీకాలంతోనే ముగుస్తాయి. అంటే 2024 జూన్‌లో ఈ అధికరణ చేరిస్తే తర్వాత ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 2029లో లోక్‌సభ పదవీకాలంతోపాటే ఆ సభల పదవీకాలం ముగుస్తుంది. అంటే 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్నికలు జరిగే అసెంబ్లీల కాల పరిమితి ఐదేళ్ల పూర్తి కాలం ఉండదన్న మాట.
సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే తొలి పార్లమెంట్ సమావేశంలోనే 82ఏను చేర్చేందుకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ నోటిఫికేషన్ తేదీని అపాయింటెడ్ డేట్‌గా భావిస్తారు. ఈ తేదీ తర్వాత ఎన్నికలు జరిగే అసెంబ్లీల పదవీకాలం లోక్‌సభ పదవీకాలంతోనే ముగుస్తుంది. అప్పటి నుంచి దేశంలో లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి.
82ఏ ప్రకారం సార్వతిక ఎన్నికల సమయంలో ఏ అసెంబ్లీకైనా ఎన్నికలు నిర్వహించలేకపోతే ఆ అసెంబ్లీ ఎన్నికలను తర్వాతి తేదీలో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు.
191 రోజులు విస్తృత సంప్రదింపులు..
2023 సెప్టెంబరు 2న కోవింద్ సారథ్యంలోని ప్యానె ల్ ఏర్పాటైంది. నాటి నుంచి 191 రోజులపాటు నిర్విరామంగా నిపుణులు, సంబంధిత భాగస్వాములతో విస్తృ త స్థాయిలో సంప్రదింపులు జరిపిందని ఓ అధికార ప్రకటనలో పేర్కొన్నారు. లోతైన పరిశోధనలు చేపట్టినట్లు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో.. సిఫారసులు చేసిందని.. చాలా తక్కువ రాజ్యాంగ సవరణలు చేసే విధంగా వాటిని రూపొందించిందని పేర్కొన్నారు. కాగా.. తమకు మొత్తం 21,558 ప్రతిస్పందనలు రాగా.. వాటిలో 80 శాతం మంది జమిలి ఎన్నికలను సమర్థించారని ప్యానెల్ తెలిపింది.
సమర్థన.. అభ్యంతరం..
సంప్రదింపుల సందర్భంగా ‘ఒకదేశం-ఒకే ఎన్నిక’ విధానాన్ని ఎవరెవరు సమర్థించారు.. ఎవరు వ్యతిరేకించారో ప్యానెల్ తన నివేదికలో పేర్కొంది. ఈ విధానాన్ని నలుగురు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తు లు సమర్థించారని తెలిపింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ యూయూ లలిత్ లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను కోవింద్ ప్యానెల్‌కు అందజేశారు.హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తు(సీజే)లలో 9 మంది ఈ విధా నం వల్ల ప్రయోజనాలను ప్రస్తుతించగా.. మూడు హై కోర్టుల మాజీ సీజేలు మాత్రం గట్టిగా వ్యతిరేకించారు. తమ తమ అభ్యంతరాలను ప్యానెల్‌కు తెలియజేశారు. లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజకీయ జవాబుదారీతనాన్ని దెబ్బతీస్తుందని ఢిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఏపీ షా అభిప్రాయపడ్డారు. పనితీరుపై సమీక్ష లేకుం డా ప్రజాప్రతినిధులకు ఐదేళ్ల పదవీకాలాన్ని స్థిరపరిస్తే వారి పనితీరుపై సమీక్షకు ఆస్కారం ఉండదని.. ప్రజాస్వామిక విలువలనే ఇది సవాల్ చేస్తుందని తెలిపారు. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ ఆలోచన ప్రజాస్వామిక విలువలకు అనుగుణంగా లేదని కలకత్తా హైకోర్టు మాజీ సీజే జస్టిస్ గిరీశ్ చంద్ర గుప్తా అన్నారు. ఈ పద్ధతి భారత సమాఖ్య స్వరూపాన్ని నాశనం చేస్తుందని మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ స్పష్టం చేశారు. తరచూ మధ్యంతర ఎన్నికల వల్ల ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కల్పిస్తోందన్నారు. అయితే అవినీతిని, అసమర్థతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ నిధులతో ఎన్నికలు నిర్వహించేలా సంస్కరణ తీసుకురావడం బాగుంటుందని ఆయన సూచించారు. ప్యానెల్ సంప్రదించిన నలుగురు భారత ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్లు కూడా ఏకకాలంలో ఎన్నికలకు మొగ్గుచూపారు. ప్రస్తు త, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల(ఎ్‌సఈసీ)లో ఏడుగురు సైతం దీనిని సమర్థించారు.
జర్మనీ/జపాన్ విధానం మేలు: కశ్యప్
ప్యానెల్ సభ్యుడైన సుభాష్ కశ్యప్ జర్మనీ విధానం మేలని సూచించారు. జర్మన్ పార్లమెంటు బుందస్టాక్ చాన్స్‌లర్ (ప్రధాని)ని నియమిస్తుంది. ఆయన/ఆమెపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం తెస్తే.. అదే బ్యాలెట్‌పై ప్రత్యామ్నాయ చాన్స్‌లర్‌గా తమ అభ్యర్థి ఎవరో సూ చించాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే దేశాధ్యక్షుడు చాన్స్‌లర్‌ను నియమిస్తాడు. జపాన్‌లో కూడా ప్రధానమంత్రిని పార్లమెంటు (నేషనల్ డైట్) నియమిస్తుంది. తర్వాత చక్రవర్తి ఆమోదిస్తాడు. ఈ రెండు విధానాల్లో ఒకటి అనుసరించాలని, దీనివల్ల దేశానికి మేలు కలుగుతుందని కశ్యప్ సూచించినట్లు నివేదిక తెలిపింది.
ఏడు దేశాల విధానాల అధ్యయనం..
కోవింద్ ప్యానెల్ దక్షిణాఫ్రికా, జర్మనీ, స్వీడన్, బెల్జియం, ఇండొనేసియా, జపాన్, ఫిలిప్పైన్స్ దేశాల ఎన్నికల విధానాలపై అధ్యయనం చేసింది. ‘దక్షిణాఫ్రికాలో జాతీయ అసెంబ్లీ, ప్రొవిన్షియల్ (ప్రాంతీయ) అసెంబ్లీలకు పౌరులు ఏకకాలంలో ఓటేస్తారు. అయితే ఈ దేశంలో మున్సిపల్ ఎన్నికలు మాత్రం విడిగా జరుగుతాయి. స్వీడన్‌లో దామాషా ఎలక్టొరల్ వ్యవస్థ అమల్లో ఉంది. పార్లమెంటు (రిక్స్‌దాగ్), కౌంటీ కౌన్సిళ్లు, మున్సిపల్ కౌన్సిళ్లకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయి. వివిధ రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా వాటికి పార్లమెంటు, మండళ్లలో సీట్లు కేటాయిస్తారు. ఈ ఎన్నికలు ప్రతి నాలుగేళ్లకు సెప్టెంబరు రెండో ఆదివారం జరుగుతాయి. మున్సిపల్ కౌన్సిళ్లకు మాత్రం ప్రతి ఐదేళ్లకోసారి సెప్టెంబరు రెండో ఆదివారం రోజే నిర్వహిస్తారు’ అని నివేదికలో వివరించారు. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు జరగాలన్న ప్రతిపాదనలు గతంలో పలు నివేదికలు, అధ్యయనాల్లో వెలుగుచూశాయని ప్యానెల్ తెలిపింది.
రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకే..: కాంగ్రెస్
జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న సిఫారసుపై కాంగ్రెస్ మండిపడింది. ‘ఒక దేశం-ఇక ఎన్నికలు ఉండవు’ అని ఎద్దేవాచేసింది. జమిలి ఎన్నికలతో బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నాశనం చేయాలని మోదీ ప్రభుత్వం చూ స్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గురువారం నాశిక్‌లో విమర్శించారు. ‘ప్రధాని మోదీ లక్ష్యం స్పష్టంగా ఉంది.. ఆయన ఎక్కడకు వెళ్లినా లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ.. అంటే 400 ఎంపీ స్థానాలతో స్పష్టమైన మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ప్యానెల్ నివేదికతో రహస్యం బట్టబయలైంది’ అని ధ్వజమెత్తారు.