Share News

Nitish Kumar: సంచలన నిర్ణయం దిశగా నితీష్ కుమార్.. టెన్షన్‌లో ‘ఇండియా కూటమి’..

ABN , Publish Date - Jan 25 , 2024 | 08:26 PM

Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో పెను మార్పు రాబోతోందా? ఎమ్మెల్యేలంతా పాట్నాకు రావాలని సీఎం నితీష్ కుమార్ ఆదేశించడం వెనకున్న కారణం ఏంటి? అంటే నితీష్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. అవును.. నితీష్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారట. సీఎం పదవికి రాజీనామా చేసి.. అసెంబ్లీని కూడా రద్దు చేయాల్సిందిగా సిఫారసు చేస్తారని జేడీయూ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది.

Nitish Kumar: సంచలన నిర్ణయం దిశగా నితీష్ కుమార్.. టెన్షన్‌లో ‘ఇండియా కూటమి’..
Nitish Kumar

Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో పెను మార్పు రాబోతోందా? ఎమ్మెల్యేలంతా పాట్నాకు రావాలని సీఎం నితీష్ కుమార్ ఆదేశించడం వెనకున్న కారణం ఏంటి? నితీష్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారా? అంటే అవుననే సమాచారం అందుతోంది. అవును.. నితీష్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారట. సీఎం పదవికి రాజీనామా చేసి.. అసెంబ్లీని కూడా రద్దు చేయాల్సిందిగా సిఫారసు చేస్తారని జేడీయూ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. పార్టీకి చెందిన ముఖ్య నేతలు లాలన్ సింగ్, మంత్రి విజయ్ చౌదరి సహాలు పలువురితో సీఎం నితీష్ కుమార్ భేటీ అయ్యారు. నితీష్ తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు వివరించారట. సీఎం పదవికి రాజీనామా చేయడంతో పాటు, అసెంబ్లీ రద్దు అంశంపై ఏ క్షణంలోనైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.

ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ‘ఇండియా అలయన్స్’లో నితీష్ కుమార్‌ది కీలక రోల్. కానీ, ఆయన ఇండియా కూటమికి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. నితీష్ కుమార్ తిరిగి బీజేపీతో జత కట్టేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేఫథ్యంలోనే.. బీహార్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక నితీష్‌తో పాటు.. బీజేపీ సైతం తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీకి రావాలని పిలిపించినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రకంపనలు సృష్టిస్తున్న బీహార్ పాలిటిక్స్..

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించబోతున్నాయి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా ఆర్జేడీతో పొత్తును విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నితీష్ కుమార్ మళ్లీ బీజేపీతో జతకట్టి ఎన్డీయే కూటమిలో చేరే ఛాన్స్ ఉందంటూ అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. నితీష్‌ను ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోకుండా అడ్డుకునేందుకు ఆర్జేడీ తీవ్రంగా ప్రయత్నిస్తోందట.

విపక్ష కూటమిలో కలవరం..

నితీష్ కుమార్ వైఖరిలో ఈ ఆకస్మిక మార్పు.. విపక్ష కూటమిలో కలవరం రేపుతోంది. ఇప్పటికే బెంగాల్, పంజాబ్‌లలో ఇండీయా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. పంజాబ్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, బెంగాల్‌లో అధీర్ రంజన్ చౌదరి తృణమూల్‌పై నిరంతర విమర్శలు.. ఆ రెండు పార్టీలను అసంతృప్తికి గురిచేశాయని టాక్. అందుకే.. ఒంటరిపోరుకు సిద్ధమైనట్లు ప్రకటించాయి.

గోడమీద పిల్లిలా..

జేడీయూ అధినేత నితీష్ కుమార్ తీరు గోడమీద పిల్లిలా ఉంది. ఎనిమిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్‌కు.. అటు బీజేపీతో, ఇటు ఆర్జేడీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, విడిపోవడం పరిపాటిగా మారిపోయింది. 2014కు ముందు ఎన్డీయే కూటమిలో ఉన్న నితీష్ కుమార్.. ఆ సమయంలో బీజేపీ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగారు. 2015 ఫిబ్రవరిలో జరిగిన బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి మహాకూటమిగా ఏర్పడి భారీ మెజార్టీతో విజయం సాధించారు.

అయితే, 2015 నవంబర్ 20న మహాకూటమిని చీల్చి మళ్లీ బీజేపీలో చేరారు నితీష్ కుమార్. 20 నవంబర్ 2015 నుండి ఫిబ్రవరి 2020 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఆయన బీజేపీతోనే ఉన్నారు. అయితే, ఆ ఎన్నికల్లో జేడీయూ చాలా తక్కువ సీట్లు గెలిచి మూడో స్థానానికి పడిపోయింది. అయితే నితీష్ ముఖ్యమంత్రిని చెయ్యడానికే బీజేపీ మొగ్గుచూపింది. అలా మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, మళ్లీ ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు రేగింది. ఆగస్ట్ 9, 2022న మరోసారి ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిని నితీష్ కుమార్.. ఆర్జేడీ కూటమిలో చేరారు. ఈ స్నేహం కూడా ఎంతోకాలం కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు.

ఆర్జేడీ ధీమా ఇదే..

ఆర్జేడీతో జేడీయూ తెగతెంపులు చేసుకుంటుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నితీష్ కుమార్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ఉన్న అన్ని మార్గాలను లాలూ ప్రయత్నిస్తున్నట్లు ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ నితీష్ ఓకే అంటే బయటి నుంచి మద్దతివ్వడానికి కూడా లాలూ సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. బీహార్‌లో ముస్లిం, యాదవ్ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని లాలూ అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. నితీష్‌తో ఉంటే.. ఆర్జేడీకి అత్యంత వెనుకబడిన ప్రజల ఓట్లు, మహిళల ఓట్లు పడే అవకాశం ఉందని లాలూ ప్రసాద్ భావిస్తున్నట్లు టాక్. ఇది నితీష్ కుమార్‌కు కూడా లబ్ధి చేకూరుస్తుందని, మొత్తంగా ప్రభుత్వానికి వచ్చే ఢోకా అయితే ఏమీ లేదని, నితీష్ అలాంటి నిర్ణయాలేమీ తీసుకోబోరని చెబుతున్నారు.

ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు..

బీహార్ బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాజ్ చౌదరి, సుశీల్ మోదీ, నిత్యానంద్ రాయ్‌లకు బీహార్ పార్టీ ఇన్‌ఛార్జ్ వినోద్ తావ్డే ఫోన్ చేశారు. బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత విజయ్ సిన్హా కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఒకవేళ నితీష్ కుమార్ బీజేపీతో కలిస్తే.. బీజేపీ అభ్యర్థినే సీఎం చేయాలని పట్టుబట్టాలని భావిస్తున్నారట. దీనికి ప్రతిగా కేంద్ర ప్రభుత్వంలో నితీష్ కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తోందట బీజేపీ. లోక్‌సభ ఎన్నికల వేళ నితీష్‌ రాజకీయ ఎత్తుగడలకు అవకాశం ఇవ్వకూడదని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ నితీష్ కుమార్ అసెంబ్లీని రద్దు చేస్తే లోక్‌సభతో పాటు బీహార్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉంది.

Updated Date - Jan 25 , 2024 | 08:49 PM