JMM : సోరెన్ కుటుంబంలో సీత తప్ప ముగ్గురికి పట్టం కట్టిన ఓటర్లు
ABN , Publish Date - Nov 24 , 2024 | 04:02 AM
ఝార్ఖండ్ ప్రజలు జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నారు. ఈ కుటుంబం నుంచి మొత్తం నలుగురు నాయకులు తాజా ఎన్నికల్లో పోటీ చేశారు.
ఝార్ఖండ్ ప్రజలు జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నారు. ఈ కుటుంబం నుంచి మొత్తం నలుగురు నాయకులు తాజా ఎన్నికల్లో పోటీ చేశారు. బర్‌హైత్ నియోజకవర్గం నుంచి హేమంత్ సోరెన్ వరుసగా మూడోసారి కూడా విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గమ్లియేల్ హెమ్‌బ్రామ్‌పై 39,791 ఓట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. హేమంత్‌కు 95,612 ఓట్లు రాగా, హెమ్‌బ్రామ్‌కు 55,821 ఓట్లు వచ్చాయి. హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ గాండే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి మున్నియా దేవిపై 17,142 ఓట్ల మెజారిటీతో విజయంసాధించారు. సీఎం హేమంత్ తమ్ముడు బసంత్ సోరెన్ డుమ్కా నియోజకవర్గంలో విజయం దక్కించుకున్నారు. కుటుంబంతో విభేదించి బీజేపీతో చేతులు కలిపిన సీఎం హేమంత్ వదిన సీతా సోరెన్ కమలం గుర్తుపై జంతారా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోర పరాజయం పొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ఫాన్ అన్సారీ 43,676 ఓట్ల భారీ మెజారిటీతో సీతపై విజయం దక్కించుకున్నారు. ఇక, ఝార్ఖండ్ ఎన్నికల్లో గెలిచిన ప్రముఖుల్లో మాజీ సీఎం చంపాయీ సోరెన్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ ఉన్నారు. సరాయ్‌కెలా నుంచి చంపాయీ సోరెన్ (బీజేపీ) నెగ్గారు. ధన్వార్ నుంచి బాబూలాల్ మరాండీ 35,068 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా చందన్‌కియారి నుంచి బరిలో దిగిన ప్రతిపక్ష నేత అమర్ కుమార్ బౌరి (బీజేపీ) మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.