బీజేపీలో చేరుతున్నా: సుమలత
ABN , Publish Date - Apr 04 , 2024 | 04:37 AM
సినీనటి, కర్ణాటకలోని మండ్య నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ సుమలతా అంబరీశ్ బీజేపీలో చేరనున్నారు.
మండ్య, ఏప్రిల్ 3: సినీనటి, కర్ణాటకలోని మండ్య నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ సుమలతా అంబరీశ్ బీజేపీలో చేరనున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామికి ఆమె మద్దతు ప్రకటించారు. బుధవారం తన మద్దతుదారులతో సమావేశమైన ఆమె ఈ విషయాలను వెల్లడించారు. ‘నేను మండ్యను వీడి ఎక్కడికీ వెళ్లను. రానున్న రోజుల్లోనూ మీకోసం ఇక్కడే పనిచేస్తాను. బీజేపీలో చేరాలని నేను నిర్ణయించుకున్నా’ అన్నారు. తాను స్వతంత్ర ఎంపీని అయినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన నియోజకవర్గానికి రూ.4వేల కోట్ల వరకూ గ్రాంట్లు ఇచ్చిందని, మండ్యకు సంబంధించిన ఏ నిర్ణయంలోనైనా బీజేపీ నేతలు తనను విశ్వాసంలోకి తీసుకొంటున్నారని తెలిపారు. ‘బీజేపీకి నీ అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ఆయన మాటను నేను గౌరవించాల్సి ఉంది’ అన్నారు. ‘నేను కాంగ్రె్‌సలో చేరాలని కొంతమంది కోరారు. అయితే, సుమలత అవసరం ఉందని పార్టీ భావించడం లేదని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ఈ మాటలు విన్నాక ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు కాంగ్రె్‌సలోకి ఎలా వెళ్లగలరు?’ అంటూ సుమలత భావోద్వేగానికి గురయ్యారు.