Justice Chittaranjan Das: నేను ఆరెస్సెస్ సభ్యుడ్నే
ABN , Publish Date - May 22 , 2024 | 05:26 AM
తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) జీవితకాల సభ్యుడినని, తాను మళ్లీ అక్కడికి వెళ్లి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ చిత్తరంజన్ దాస్ చెప్పారు.
పిలిస్తే మళ్లీ అక్కడికే వెళ్తా
పదవీ విరమణ రోజున
కలకత్తా హైకోర్టు జడ్జి
కోల్‌కతా, మే 21: తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) జీవితకాల సభ్యుడినని, తాను మళ్లీ అక్కడికి వెళ్లి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ చిత్తరంజన్ దాస్ చెప్పారు. సోమవారం పదవీ విరమణ చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరెస్సె్‌సతో తనకు చిన్నప్పటి నుంచే అనుబంధం ఉందని, ఈ విషయం చెప్పడానికి భయపడడం లేదని అన్నారు. వీడ్కోలు సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ‘‘నేను ఓ సంస్థకు రుణ పడి ఉన్నా. చిన్నప్పుడే అందులో చేరా.
యవ్వన దశలోనూ అందులోనే కొనసాగా. ధైర్యంగా, నిజాయితీగా మెలగడాన్ని నేర్చుకున్నా. కొందరికి నచ్చకపోవొచ్చేమోగానీ నేను అప్పుడు...ఇప్పుడు ఆరెస్సెస్ సభ్యుడినే’’ అంటూ తన నేపథ్యాన్ని వివరించారు. ‘‘ఏ సాయం కావాలని పిలిచినా, తాను చేయగలిగే ఏ పని అప్పగించినా మళ్లీ ఆ సంస్థలో చేరుతా. అయితే ఆ సంస్థ పేరు చెప్పుకొని వృత్తిలో ఉన్నత స్థానాలు పొందలేదు.
జడ్జిగా పనిచేసిన సమయంలో ఆ సంస్థకు దూరంగానే ఉంటూ వచ్చా’’నని చెప్పారు. ‘ఒడిశాకు చెందిన జస్టిస్ చిత్తరంజన్ దాస్ 2009లో ఒడిశా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022లో కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. కాగా, మార్చి నెలలో పదవీ విరమణ చేసిన కలకత్తా హైకోర్టు జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ వెంటనే బీజేపీలో చేరారు. ప్రస్తుతం తామ్‌లుక్ నియోజవర్గం నుంచి లోక్‌సభ బరిలో ఉన్నారు