Share News

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు.. కంగనా రనౌత్ సంచలన స్టేట్‌మెంట్

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:11 PM

ఎలాంటి బిడియం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే అతికొద్ది మంది సెలెబ్రిటీల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఒకరు. ఈమధ్య కాలంలో ఆమె తన సినిమాల పరంగా కన్నా, వివాదాస్పద విషయాల్లోనే నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు.

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు.. కంగనా రనౌత్ సంచలన స్టేట్‌మెంట్

Kangana Ranaut On Bilkis Bano Case: ఎలాంటి బిడియం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే అతికొద్ది మంది సెలెబ్రిటీల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఒకరు. ఈమధ్య కాలంలో ఆమె తన సినిమాల పరంగా కన్నా, వివాదాస్పద విషయాల్లోనే నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు. రియల్ లైఫ్ సంఘటనలపై తనదైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ.. సరికొత్త సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. తనపై వ్యతిరేకత వచ్చినా సరే.. దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సామాజిక సమస్యలపై గళం ఎత్తుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆమె బిల్కిస్ బానో కేసుపై సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. బిల్కిస్ బానో నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమా చేసేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని.. కానీ నిర్మాణ సంస్థలే ముందుకు రావడం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు.


ఎక్స్ వేదికగా ఒక నెటిజన్ నటి కంగనా రనౌట్ పేరుని ట్యాగ్ చేస్తూ.. ‘‘మహిళా సాధికారతను ప్రోత్సాహించే మీరు, బిల్కిస్ బానోపై సినిమా ఎందుకు చేయకూడదు? ఒక కమ్యూనిటీపై ఓ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉగ్రవాద సంస్థలతో కలిసి ఎలా ఉగ్రదాడి చేసిందో మీరు ప్రపంచానికి చూపించగలరు’’ అని రాసుకొచ్చాడు. ఇందుకు కంగనా స్పందిస్తూ.. ‘‘బిల్కిస్ బానోపై నాకు సినిమా చేయాలని ఉంది. నా దగ్గర కథ కూడా సిద్ధంగా ఉంది. నేను మూడేళ్లు రీసెర్చ్ చేసి ఈ స్టోరీని రెడీ చేశాను. కానీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు రాజకీయ ప్రేరేపిత సినిమాలు చేయమని తేల్చి చెప్పారు. ఇక నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నానని చెప్పి ‘జియో సినిమా’ నాతో కలిసి పని చేయనని ఇప్పటికే ప్రకటించింది. ఇక జీ సంస్థకు జియో సినిమాలో భాగస్వామ్యం ఉంది. కాబట్టి.. నా దగ్గర ఏ ఆప్షన్ లేదు’’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చింది.

ఇదిలావుండగా.. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో కుటుంబ సభ్యుల్ని నిందితులు చంపేసి, అప్పట్లో గర్భంతో ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. అయితే.. నిందితుల్లో ఒకరు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా, దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం గుజరాత్ కోర్టు రెమిషన్‌ మంజూరు చేసింది. దీంతో.. దోషులంతా 2022 ఆగస్టు 15న విడుదలయ్యారు. అయితే.. జనవరి 8న సుప్రీంకోర్టు ఈ రెసిషన్‌ని రద్దు చేస్తూ, దోషుల్ని లొంగిపోవాలని ఆదేశించింది.

Updated Date - Jan 10 , 2024 | 03:11 PM