Share News

No Detention Policy : 5, 8 తరగతులకు నో డిటెన్షన్‌ రద్దు

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:04 AM

విద్యాహక్కు చట్టం-2019కి చేసిన సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సవరణలో పేర్కొన్న విధంగా 5, 8 తరగతులకు ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేసింది. దీనిప్రకారం.. 5, 8 క్లాసుల విద్యార్థులు పరీక్షలు

No Detention Policy : 5, 8 తరగతులకు నో డిటెన్షన్‌ రద్దు

విద్యార్థులు ఫెయిలైతే మళ్లీ పరీక్షలు

అయినా విఫలమైతే అవే తరగతుల్లో

కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబరు 23: విద్యాహక్కు చట్టం-2019కి చేసిన సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సవరణలో పేర్కొన్న విధంగా 5, 8 తరగతులకు ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేసింది. దీనిప్రకారం.. 5, 8 క్లాసుల విద్యార్థులు పరీక్షలు ఫెయిల్‌ అయితే.. వారిని ఆటోమేటిక్‌గా పైతరగతులకు ప్రమోట్‌ చేయరు. అదేవిధంగా బడి మాన్పించడం, టీసీ ఇచ్చి ఇంటికి పంపించడం వంటివి ఉండవు. సదరు తరగతుల తుది పరీక్షా ఫలితాలు విడుదలైన తర్వాత రెండు మాసాల మధ్య ఫెయిలైన విద్యార్థులకు పునఃపరీక్షలు నిర్వహిస్తారు. వాటిలోనూ విద్యార్థులు మళ్లీ ఫెయిలైతే.. అవే క్లాసుల్లో వారిని కొనసాగిస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు రెండు మాసాల వ్యవధిలో టీచర్లు, తల్లిదండ్రులు వారిని మరింత గైడ్‌ చేయాలని సూచించింది. ఏ ఒక్క విద్యార్థీ ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు పాఠశాలకు దూరం కాకూడదన్నదే సవరణ చట్టం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. కాగా, 5, 8 తరగతులకు ఇప్పటికే ఈ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి. తాజా ఉత్తర్వులు దేశంలోని 3 వేలకు పైగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్‌ స్కూళ్లు సహా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలకు వర్తించనున్నట్టు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. విద్య అనేది రాష్ట్రాల జాబితాలో ఉన్నందున ఆయా రాష్ట్రాలు ఈ విషయంపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇదిలావుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నో డిటెన్షన్‌ విధానం కొనసాగుతోంది.

Updated Date - Dec 24 , 2024 | 06:04 AM