Hamas : సిన్వర్‌ది వీరమరణం
ABN , Publish Date - Oct 19 , 2024 | 04:22 AM
దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడిలో తమ చీఫ్ యాహ్యా సిన్వర్ మృతి చెందినది నిజమేనని హమాస్ మిలిటెంట్ గ్రూప్ స్పష్టం చేసింది.
తమ చీఫ్ మృతిని ధ్రువీకరించిన హమాస్
సిన్వర్ యోధుడని కీర్తించిన ఇరాన్ అధ్యక్షుడు
టెల్ అవీవ్, గాజా, అక్టోబరు 18: దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడిలో తమ చీఫ్ యాహ్యా సిన్వర్ మృతి చెందినది నిజమేనని హమాస్ మిలిటెంట్ గ్రూప్ స్పష్టం చేసింది. సిన్వర్ ఇజ్రాయెల్‌పై చివరిదాకా పోరాడి అమరుడయ్యాడని హమాస్ గ్రూప్ డిప్యూటీ చీఫ్ ఖలీల్ అల్ హయ్య కీర్తించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా సిన్వర్‌ను యోధుడిగా కీర్తిస్తూ నివాళులర్పించారు.
మరోవైపు, హమాస్ కనుక ఆయుధాలను వదిలి తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేస్తే గాజాలో యుద్ధం రేపే ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. సిన్వర్ మృతితో యుద్ధం ముగింపు దశ ఆరంభమైందన్నారు. బందీలను అప్పగించకపోతే హమాస్ ఉగ్రవాదులను వేటాడి హతమారుస్తామన్నారు. అయితే, బందీలను విడుదల చేయబోమని హమాస్ స్పష్టం చేసింది. గాజాలో యుద్ధం ఆపి ఇజ్రాయెల్ బలగాలు పూర్తి స్థాయిలో వెనక్కు వెళ్లడంతో పాటు జైళ్లలో మగ్గుతోన్న పాలస్తీనియన్లను విడుదల చేసేదాకా తమ పోరాటం కొనసాగుతుందని తెలిపింది.
చివరి క్షణాల వీడియో వైరల్
యాహ్యా సిన్వర్ చివరి క్షణాల వీడియో వైరల్ అయింది. ఐడీఎఫ్ బలగాలు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశాయి. తన దగ్గరకు వస్తున్న డ్రోన్‌పై సిన్వర్ తన చేతిలోని కర్రను విసురుతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. కర్ర విసరడాన్ని ఇజ్రాయెల్‌పై చివరిక్షణంలో కూడా పోరాడినట్లుగా సిన్వర్ సమర్థకులు అభివర్ణిస్తున్నారు. కాగా, ఇజ్రాయెల్ ట్రైనీ సైనికులే సిన్వర్‌ను హతమార్చారు. బుధవారం వారు దక్షిణ గాజాలో ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఓ భవనం నుంచి ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో సైనికులు డ్రోన్ల సాయంతో ప్రతిదాడి జరిపారు. బాంబులను ప్రయోగించారు. అప్పుడే సిన్వర్ హతమయ్యాడు.